Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ బోర్డు నిర్వాకం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మంగళవారం విడుదలైన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఓ విద్యార్థికి సంస్కృతంలో సున్నా మార్కులొచ్చాయి. ఇతర సబ్జెక్టులన్నింటిలోనూ ఆ విద్యార్థి పాస్ కావడం గమనార్హం. అలాంటి సంస్కృతంలో సున్నా మార్కులు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బైపీసీ చదివిన జమ్ములొల్ల హరికిరణ్ (హాల్‌టికెట్ నెంబర్ 2256202882) అనే విద్యార్థి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఇంగ్లీష్‌లో 50, బాటనీలో 21, జువాలజీలో 47, ఫిజిక్స్‌లో 29, కెమిస్ట్రీలో 46 మార్కులు సాధించాడు. ఇక ప్రాక్టికల్ పరీక్షల్లోనూ బాటనీలో 25, జువాలజీలో 25, ఫిజిక్స్‌లో 28, కెమిస్ట్రీలో 28 మార్కులొచ్చాయి. కానీ ఆ విద్యార్థికి సంస్కృతంలో సున్నా మార్కులు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. అయితే ఆ ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ కావడం వల్ల ఇంటర్ ఫెయిలయ్యాడు. ఆ సబ్జెక్టులో పాసైతే ఇంటర్ ఉత్తీర్ణత అయ్యే అవకాశమున్నది. ఇంటర్ బోర్డు నిర్వాకం వల్లే ఆ విద్యార్థికి సున్నా మార్కులొచ్చాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పు ఎక్కడ జరిగిందన్నది తెలియాల్సి ఉన్నది. జవాబు పత్రం మూల్యాంకనంలోనా, కోడింగ్, డీకోడింగ్లోనా, మార్కులను కంప్యూటర్లో అప్లోడ్ చేసేటపుడా?అన్న విషయంపై స్పష్టత రావాలి. ఆ విద్యార్థి మార్కులను పరిశీలించి న్యాయం చేయాలన్న విజ్ఞప్తులొస్తున్నాయి.