Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌర సమాజంపై క్రూరమైన దాడి
- ఆమెను బేషరతుగా విడుదల చేయాలి
- సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అజీజ్ పాషా డిమాండ్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
మానవ హక్కుల రక్షణకు బలమైన స్వరంగా నిలిచిన తీస్తా సెతల్వాద్ అరెస్టు ''పౌర సమాజంపై క్రూరమైన దాడి'' అని, ఆమెను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా డిమాండ్ చేశారు. పౌరహక్కుల కార్యకర్త, ప్రముఖ జర్నలిస్ట్ తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ ఆర్.బి.శ్రీకుమార్, సంజీవ్ భట్ అక్రమ అరెస్టును నిరసిస్తూ.. హైదరాబాద్‌లోని నారాయణగూడ, వైఏంసీఏ కూడలిలో మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా అజీజ్ పాషా మాట్లాడుతూ.. పౌరులకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, స్వేచ్ఛను నిరంకుశ మోడీ ప్రభుత్వం తీవ్రంగా ఉల్లంఘిస్తోందన్నారు. ప్రజాస్వామ్య భావాలు కలిగి ప్రశ్నించే పౌరులందరిపైనా తప్పుడు, నకిలీ కేసులు బనాయిస్తూ.. ఈడీ, ఎన్ఐఏ, సీబీఐ యంత్రాంగాలను దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలు హక్కుల కోసం పోరాడే తీస్తా సెతల్వాద్, ఆర్.బి.శ్రీ కుమార్లాంటి అమాయకులపై తప్పుడు కేసులు పెట్టడం అపహాస్యం తప్ప మరొకటి కాదన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఈ అరెస్టులను ఖండించడం మోడీ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. అనేక మంది న్యాయ నిపుణులు, మేధావులు ఎమర్జెన్సీ చీకటి మేఘాలు మళ్లీ కనిపిస్తున్నాయని ఆందోనళ వ్యక్తం చేస్తున్నారన్నారు. మానవ హక్కుల రక్షణలో ప్రపంచంలోని 37 దేశాల కంటే భారతదేశం చాలా వెనుకబడి ఉందని, ఉన్న 13 ప్రాథమిక మానవ హక్కులలో 12 నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. 453 పేజీల తీర్పులో శాంతి భద్రతల వైఫల్యం, గుజరాత్ పరిపాలన అసమర్థతపై సుప్రీంకోర్టు దృష్టి సారించిన విషయాన్నీ కేంద్ర, గుజరాత్ ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ, రాష్ట్ర నాయకులు ఎం.నరసింహ, ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులు బి.స్టాలిన్, భారత జాతీయ మహిళా సమాఖ్య హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు కె.కష్ణ కుమారి, ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి మునీర్ పటేల్, రాష్ట్ర నాయకులు కంపల్లి శ్రీనివాస్, దళిత హక్కుల పోరాట సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల రాజ్ కుమార్, ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెర్లకంటి శ్రీకాంత్ పాల్గొన్నారు.