Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై ఒకటి నుంచి అమల్లోకి
- తనిఖీల కోసం జాతీయ, రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
- ప్రజల భాగస్వామ్యం పెరిగితేనే విజయవంతం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగిల్ యూజ్ ప్లాస్టిక్(ఎస్యూపీ) వస్తువులను భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఇది జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది. ఆ శాఖ 2021 ఆగస్టు 12న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలు, 2021 ను నోటిఫై చేసిన విషయం విదితమే. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల అక్రమ తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగాన్ని తనిఖీ చేయడానికి జాతీయ, రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేయనున్నది. ఎస్యూపీ వస్తువుల అంతర్-రాష్ట్ర తరలింపును ఆపడానికి సరిహద్దు చెక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్రాలకు ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటివి ఎన్ని ఏర్పాటు చేసినా దీని ప్రజలంతా అవగాహన పొంది ఎస్యూపీ ప్లాస్టిక్ వస్తువులను వాడకుండా భాగస్వామ్యమైనప్పుడే అది విజయవంతమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా 2022 జూలై 1 నుంచి తక్కువ యుటిలిటీ, అధిక లిట్టరింగ్ సామర్ధ్యం కలిగిన గుర్తించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగంపై నిషేధం అమలు కానున్నది. ఎస్యూపీ వ్యర్థాలు భూ, జలావరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ కాలుష్యాన్ని నివారించడం ప్రపంచ దేశాలకు ఒక సవాలుగా మారింది. 2019 లో జరిగిన నాలుగో ఐక్యరాజ్యసమితి పర్యావరణ అసెంబ్లీలో, భారతదేశం సింగిల్-యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల కాలుష్యాన్ని పరిష్కరించడంపై ఒక తీర్మానాన్ని ప్రయోగాత్మకంగా తీసుకున్నది. ప్రపంచ దేశాలన్నీ దీనిపై దృష్టిసారించాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పింది. 2022 మార్చిలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ అసెంబ్లీ ఐదోసెషన్లో, ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రపంచ చర్యను నడిపించే తీర్మానంపై ఏకాభిప్రాయాన్ని అభివృద్ధి చేయడానికి మన దేశం అన్ని సభ్య దేశాలతో నిర్మాణాత్మకంగా నిమగమైంది. అందులో భాగంగానే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సవరణ నిబంధనలు రూపొందించింది. 2021 సెప్టెంబర్ 30 నుంచి డెబ్బై ఐదు మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వాడకాన్ని నిషేధించింది. 31 డిసెంబర్ 2022 తర్వాత నూట ఇరవై మైక్రాన్ల మందం కంటే తక్కువ మందం కలిగిన వాటిపైనా కేంద్ర ప్రభుత్వం నిషేధించనున్నది.
నిషేధ జాబితాలో వస్తువులివే..
నిషేధిత వస్తువుల జాబితాలో ప్లాస్టిక్ కర్రలతో కూడిన ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ కర్రలు, ప్లాస్టిక్ జెండాలు, క్యాండిస్టిక్స్, ఐస్ క్రీమ్స్టిక్స్, అలంకరణ కోసం పాలిస్టైరిన్ (థర్మోకోల్), ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రా, ట్రేలు, స్వీట్ బాక్సుల చుట్టూ చుట్టడం లేదా ప్యాకింగ్ ఫిల్మ్‌లు, ఆహ్వాన కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్, పీవీసీ బ్యానర్లు, స్టిర్రర్లు ఉన్నాయి.
గ్రీవెన్స్ రిడ్రెసల్ యాప్ ప్రారంభం
ప్లాస్టిక్ ముప్పును అరికట్టడంలో పౌరులకు సాధికారత కల్పించడం కోసం గ్రీవెన్స్ రిడ్రెసల్ యాప్ ప్రారంభించబడింది. విస్తృత ప్రజావ్యాప్తి కోసం, ప్రకృతి - మస్కట్ కూడా ఏప్రిల్ 5న ఆవిష్కరించింది. ఈ అవగాహన ప్రచారంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు, పౌర సంస్థలు, ఆర్‌అండ్‌డి, విద్యాసంస్థలు కలిసివచ్చాయి. సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ (సిపెట్) వాటితో పాటు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు ప్రత్యామ్నాయ వస్తువుల తయారీకి సాంకేతిక సహాయాన్ని అందించటం కోసం ఎమ్ఎస్ఎమ్ఈ యూనిట్ల కోసం కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాపులను నిర్వహిస్తున్నాయి.