Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీసుకొనేందుకు నిరాకరించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన
- ఎస్ఎఫ్ఐ వినూత్న నిరసన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లోని (కేజీబీవీ) ఇంటర్మీడియట్ కళాశాలల్లో తక్షణం లెక్చరర్లను నియమించి, నెలవారీ మెస్ ఛార్జీలను రూ.1,050 నుంచి రూ.1,500కు పెంచాలని భారత విద్యార్థీ సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి బుధవారం వినతిపత్రం ఇచ్చేందుకు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష, కార్యదర్శులు తాటికొండ రవి, టీ నాగరాజు, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్ష, కార్యదర్శులు శ్రీమాన్, అశోక్‌రెడ్డి, నాయకులు రమేష్, వేణు తదితరులు ప్రతినిధి బృందంగా విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. అయితే దాన్ని తీసుకొనేందుకు ఆమె నిరాకరించంతో కార్యాలయంలోని ఖాళీ కుర్చీకి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లడుతూ రాష్ట్రంలో మొత్తం 88 కేజీబీవీ కళాశాలలు ఉన్నాయనీ, వాటిలో ఈ ఏడాది నూతనంగా ప్రారంభించినవి 37 ఉన్నాయని వివరించారు. దాదాపు 14వేల మందికి పైగా విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారని తెలిపారు. వారికి పాఠాలు చెప్పే లెక్చరర్స్ (సీఆర్టీ)ను రెన్యూవల్ చేయకుండా తొలగించారనీ, విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఇప్పటికీ దీనిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. ఇంటర్లో చేరాలని కేజీబీవీలకు వస్తున్న విద్యార్ధులకు లెక్చరర్లు లేరని అడ్మిషన్స్ ఇవ్వడం లేదన్నారు. మెస్ చార్జీలు పెంచాలనీ, యూనిఫామ్, మైనర్ రిపేర్లు, రన్నింగ్ వాటర్, మరుగుదొడ్ల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విద్యాసంస్థల్లో తెలుగు మీడీయంతో పాటు ఇంగ్లీషు మీడియం కూడా ప్రవేశ పెట్టాలని కోరారు.