Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడోసారి నియమించిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) చైర్మెన్‌గా జస్టిస్ పి స్వరూప్రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం మూడోసారి నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఆయన పదవీకాలం ఈనెల 26వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వృత్తివిద్యా కోర్సుల ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేయాల్సి ఉన్నది. కీలకమైన సమయంలో చైర్మెన్ పోస్టు ఖాళీగా ఉంటే బాగుండదని భావించిన ప్రభుత్వం తిరిగి స్వరూప్రెడ్డినే చైర్మెన్‌గా నియమించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఆ పదవిలో ఉంటారని స్పష్టం చేశారు. సాధారణంగా ఆ పదవిలో ఉండేవారు మూడేండ్ల వరకు పనిచేయాలి. కానీ ఉత్తర్వుల్లో మాత్రం అందుకు భిన్నంగా ఇవ్వడం గమనార్హం. రాష్ట్రంలో ఇంజినీరింగ్ సహా పలు వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి మూడేండ్ల వరకు ఖరారు చేయాల్సి ఉన్నది. అంటే 2022-23, 2023-24, 2024-25 విద్యాసంవత్సరాల వరకు టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజులే అమల్లో ఉంటాయి. టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్‌గా జస్టిస్ పి స్వరూప్రెడ్డిని 2015, జులై 22న రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి నియమించింది. ఆయన 2015, ఆగస్టు 17న బాధ్యతలు స్వీకరించారు. 2018, జులై 21న ఆయన పదవీ కాలం ముగిసింది. అయితే 11 నెలల తర్వాత టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్‌గా స్వరూప్రెడ్డిని ప్రభుత్వం మళ్లీ నియమించింది. అంటే 2019, జూన్ 27న నియమించడం గమనార్హం. దీంతో ఈనెల 26న ఆయన పదవీకాలం ముగిసింది. ఇప్పుడు మూడోసారి ఆయనకే చైర్మెన్ పోస్టు కట్టబెట్టడం గమనార్హం.