Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లో భారీగా పట్టివేత
- రెండు వేర్వేరు ముఠాలకు చెందిన నలుగురు అరెస్ట్
- 110 గ్రాముల మెథిఫార్మిన్, 20 గ్రాముల కొకైన్ స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఢిల్లీ కేంద్రంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటెక్ ఎన్ఫోర్సుమెంట్ వింగ్(హెచ్-ఇన్ఈడబ్య్లూ) అరెస్టు చేసింది. నలుగురు విదేశీయులను అదుపులోకి తీసుకుని నిందితుల నుంచి 110 గ్రాముల మెథిఫార్మిన్, 20గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నగర కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు. నైజీరియా, టాంజానియా దేశాలకు చెందిన డివైన్ ఎభుక్ సూజా, హన్రీ చిగ్బో ఉమేబుని, అమోబి చువుడి, ఇమ్మానుయేల్ (పరారీలో ఉన్నాడు), అహ్మద్ కమల్ అహ్మద్ బఖర్మువా, మథియాస్ ఎ షావా రెండు వేర్వేరు ముఠాలుగా ఏర్పడ్డారు. ఇందులో ప్రధాన నిందితుడు డివైన్ ఎభుక్ సుజా విదేశాల నుంచి వచ్చే మాదక ద్రవ్యాలను రిసీవ్ చేసుకుని దేశంలోని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లకు సరఫరా చేస్తున్నాడు. నాలుగు వేలకు కొనుగోలు చేసి ఏజెంట్ల ద్వారా గ్రాముకు రూ.10వేలకు విక్రయిస్తున్నాడు. ఇదిలావుండగా, కొద్ది రోజుల కిందట నగర పోలీసులు డ్రగ్స్మూలాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విదేశాల నుంచి సరఫరా చేసే ప్రధాన నిందితుల కోసం ప్రత్యేక నిఘా వేశారు. ఈ క్రమంలో నార్కోటెక్ ఎన్ఫోర్సుమెంట్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నామని సీపీ తెలిపారు. ఈ రెండు కేసుల్లో 23 మంది మాదకద్రవ్యాల వినియోగదారులను గుర్తించామని, వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీసీపీ జి.చక్రవర్తితోపాటు టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు ఉన్నారు.