Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 24 వరకు బడులు
- జులై 21 నాటికి ఎఫ్ఏ-1
- రోజూ ఐదు నిమిషాలు యోగా
- పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరంలో పాఠశాలలకు మొత్తం 230 పనిదినాలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 13 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 24 వరకు పాఠశాలలు కొనసాగుతాయని స్పస్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్‌ను బుధవారం విడుదల చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 పాఠశాలలకు చివరి పనిదినమని తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుంటాయని వివరించారు. జులై 21 నాటికి ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ-1), సెప్టెంబర్ ఐదు నాటికి ఎఫ్ఏ-2 పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. నవంబర్ ఒకటి నుంచి ఏడు వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-1) నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 21 నాటికి ఎఫ్ఏ-3 పరీక్షలుంటాయని వివరించారు. వచ్చే ఏడాది జనవరి 31 నాటికి పదో తరగతి విద్యార్థులకు ఎఫ్ఏ -4 పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఫిబ్రవరి 28 నాటికి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ పది నుంచి 17 వరకు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎస్ఏ-2 పరీక్షలను జరుపుతామని వివరించారు. ఫిబ్రవరి 28లోపు పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మార్చిలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది జనవరి పది నాటికి సిలబస్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల సిలబస్‌ను ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేయాలని కోరారు. పాఠశాలల్లో ప్రార్థన సమయంలో ప్రతిరోజూ ఐదు నిమిషాలు యోగా, ధ్యానం చేసేందుకు కేటాయించాలని ఆమె స్పష్టం చేశారు.
పండుగ సెలవులు
దసరా సెలవులు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు (14 రోజులు)
క్రిస్మస్ సెలవులు (మిషినరీ స్కూళ్లకు) డిసెంబర్ 22 నుంచి 28 వరకు(ఏడు రోజులు)
సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి 17 వరకు (ఐదు రోజులు)
అకడమిక్ క్యాలెండర్లో ముఖ్యాంశాలు
- జూన్ 13 నుంచి బడులు పున:ప్రారంభం
- జులై 21 నాటికి ఎఫ్ఏ-1 పరీక్షలు
- సెప్టెంబర్ ఐదు నాటికి ఎఫ్ఏ-2 పరీక్షలు
- నవంబర్ 1 నుంచి 7 వరకు ఎస్ఏ-1 పరీక్షలు
- డిసెంబర్ 21 నాటికి ఎఫ్ఏ-3 పరీక్షలు
- ఏప్రిల్ 10 నుంచి 17 వరకు ఎస్ఏ-2 పరీక్షలు
- మార్చిలో టెన్త్ పరీక్షలు
- స్కూళ్లకు చివరి పనిదినం ఏప్రిల్ 23
- ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు