Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగులను అవమానిస్తున్న బీజేపీ
- కడుపుమండి ఆందోళన చేసిన వారిపై అక్రమ కేసులు
- యువజన సంఘాల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆర్మీ, త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్‌ను తక్షణమే రద్దు చేయాలని యువజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో వామపక్ష యువజన సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సైయ్యద్వలి ఉల్లాద్రి, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కెేఎస్ ప్రదీప్ మాట్లాడారు. దేశ రక్షణకు సంబంధించి అత్యున్నతమైన సైనిక బలగాల నియామకాల్లో నాలుగేండ్ల కాల పరిమితి ఉద్యోగాలు ఇవ్వాలనే బీజేపీ ప్రభుత్వ వైఖరి దేశానికి అత్యంత ప్రమాదకరమని చెప్పారు. త్రివిధ దళాల్లో, సైనిక, రక్షణ రంగంలో అనేక సంవత్సరాలుగా నియామకాలు నిలిపివేసిన ప్రభుత్వం, ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా నాలుగేండ్ల కాలపరిమితి విధించడం దేశ రక్షణ రంగానికి తీవ్ర నష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. సైన్యంలో నాలుగేండ్ల్లు పనిచేసిన తర్వాత ఉద్యోగ భద్రత లేకపోతే.. బీజేపీ కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకుంటామనే ఆ పార్టీ నాయకుల వైఖరి నిరుద్యోగ యువతను అవమానించడమేనని చెప్పారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ మోసపూరిత వైఖరి అవలంబిస్తోందన్నారు. సైనిక రిక్రూట్మెంట్లలో నాలుగేండ్ల కాలపరిమితిని వ్యతిరేకిస్తూ అనేక రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్థులు, నిరుద్యోగులు కడుపుమంటతో రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు నిర్వహిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించడం సరైంది కాదన్నారు. నిరుద్యోగ ఆర్మీ అభ్యర్థులపై అక్రమ కేసులను ఎత్తేయాలని, జైలులో ఉన్న వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అనేక ఏండ్లుగా సైనిక రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలను అగ్నిపథ్ ద్వారా నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేండ్ల కాలపరిమితి తర్వాత వారికి పెన్షన్ సౌకర్యంతో పాటు ఇతర బెనిఫిట్స్ ఉండవని, తద్వారా వారి జీవిత భద్రతకు సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడిన సైనికుల దేశభక్తిని, చైతన్య స్ఫూర్తిని నీరుగార్చే ఈ పద్ధతిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని కోరారు. దేశంలో సంపన్నులకు కోట్లాది రూపాయల రాయితీలు ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దేశ రక్షణకు సంబంధించిన నియామకాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండటం సరైనది కాదన్నారు. సాయుధ బలగాల సమగ్ర దృష్టిని పరిగణనలోకి తీసుకుని సైనిక రిక్రూట్మెంట్ చేపట్టాలని, అగ్నిపథ్ వంటి స్కీమ్‌లను శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నేర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు సత్య ప్రసాద్ ధర్మేంద్ర, లక్ష్మణ్, మహమూద్, డీవైఎఫ్ఐ నాయకులు ఎండీ జావిధ్, ఎస్ఎఫ్ఐ నాయకులు కె.అశోక్‌రెడ్డి, వేణు, శ్రీమన్, అజరు, పీవైఎల్ రాష్ట్ర నాయకులు కృష్ణ, రవి కుమార్, కిరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.