Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
- వ్యవసాయ కార్మికుల సమస్యలపై రెండు రోజుల రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ ప్రారంభం
నవతెలంగాణ-బోడుప్పల్
జనాకర్షక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కొందరికే లబ్దిచేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, పేదల అభివృద్ధికి మొత్తం సంక్షేమ పథకాలు అమలు కోసం పోరాటాలు తీవ్రతరం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్వర్యంలో 'వ్యవసాయ కార్మికుల సమస్యలపై' రెండు రోజుల రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను హైదరాబాద్ బోడుప్పల్, ఎస్ఎస్ఎస్ గార్డెన్స్, కామ్రేడ్ గుండా మల్లేష్ హాల్లో బుధవారం ప్రారంభించారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య అధ్యక్షతన జరిగిన ఈ వర్క్‌షాప్‌లో నారాయణ పాల్గొని మాట్లాడారు. దేశంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని, ఇందులో దళిత, గిరిజనులే ఎక్కువగా ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర ఇన్చార్జ్ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. వామపక్షాల ఒత్తిడితో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఉపాధి హామీ చట్టానికి ఇప్పటి బీజేపీ ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయించకుండా దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. ఎన్నడూలేని విధంగా ఎనిమిదేండ్ల మోడీ పాలనలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనె, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, వాటిని నియంత్రించకుండా ప్రభుత్వ రంగ సంస్థల్ని, బ్యాంకులను అందినకాడికి అమ్ముకుంటూ కార్పొరేట్లకు లబ్దిచేసేలా పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. భారతీయ కేతా మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు టి. వెంకట్రాములు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏటేటా బడ్జెట్ తగ్గిస్తూ ఉపాధి సమస్యలు పట్టించుకోకుండా పేదలకు ఉపాధి లేకుండా చేస్తుందని విమర్శించారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు బాలమల్లేష్, కాంతయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా వ్యవసాయ కార్మికులకు రైతుబంధు పథకం మాదిరిగా కూలి బంధు ఇవ్వాలని, అలాగే 55 ఏండ్లు నిండిన వ్యవసాయ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇవ్వాలని కోరారు. వర్క్ షాప్ ప్రారంభానికి ముందు స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించినంతరం సీపీఐ సీనియర్ నాయకులు రచ్చ వాసుదేవ్ ఎర్ర జెండాను ఆవిష్కరించారు. సమావేశంలో బీకేఎంయూ జాతీయ సమితి సభ్యులు మోతె జాంగా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటి వెంకటేశ్వర్ రావు, అక్కపల్లి బాబు, ఎం. తాజుద్దీన్, కార్యదర్శులు బుద్దుల జంగయ్య, సృజన కుమార్, చింతకుంట్ల వెంకన్న, యేసయ్య, దుబ్బాసు రాములు, తదితరులు పాల్గొన్నారు.