Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాడితే తప్ప రాని పరిస్థితి...
- ఆందోళనలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా మహమ్మారి భయభ్రాంతులకు గురి చేసిన సమయంలో వారిని మంత్రులు, అధికారులు పొగడ్తలతో ముంచెత్తారు. రాత్రింబవళ్లు వారి సేవలను ఉపయోగించుకున్నారు. నిద్రాహారాలు మాని, కుటుంబాలకు దూరంగా కష్టాలకోర్చి ప్రభుత్వాస్పత్రుల్లో పేద రోగులకు సేవలందించిన డాక్టర్లు వారు. అలాంటి వైద్యులు ప్రతిసారి వేతనం కోసం రోడ్డెక్కుతున్నారు. దాదాపు ఎనిమిది నెలల నుంచి వేతనాలు రావడం లేదని మొర్రో అంటూ ఉన్నతాధికారుల నుంచి మంత్రి వరకు మొరపెట్టుకున్నా ఫైలు ముందుకు కదలలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బుధవారం నుంచి తమ ఆందోళన షురూ చేశారు. ఉదయం విధులను బహిష్కరించి ప్ల కార్డులను చేతబూని రోగులకు అర్థమయ్యేలా ఆయా ఆస్పత్రుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపు 700 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు 17 మెడికల్ కాలేజీల పరిధిలోని ప్రభుత్వాస్పత్రుల్లో సేవలందిస్తున్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రి, మానసిక వైద్యశాలతో పాటు ఆయా జిల్లాల్లో పేద రోగులకు వీరి సేవలు కీలకం. ఆ డాక్టర్లు జులై ఒకటి నుంచి అత్యవసర సేవలతో సహా అన్ని రకాల సేవలను బంద్ చేస్తామని ఆల్టిమేటం ఇచ్చారు. కేవలం డీఎంఈ సరైన సమయంలో స్పందించకపోవడంతో వేతనాలు బకాయి పడ్డాయని సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు విమర్శిస్తున్నారు.
రోగులకు ఇబ్బందులు....
ఇప్పటికే బోధనాస్పత్రుల్లో పెరిగిన రోగుల సంఖ్యకు తగినట్టు డాక్టర్లు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు సైతం విధులు బహిష్కరించి నిరసన తెలుపు తుండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని అన్ని బోధనాస్పత్రుల నుంచి సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు సరోజినీ దేవీ కంటి ఆస్పత్రిలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసి యేషన్ నాయకులు డాక్టర్ రాజీవ్, డాక్టర్ కీర్తి స్వరూప్, డాక్టర్ అనూష తదితరులు మాట్లాడుతూ, పెండింగ్ వేతనాలు విడుదల చేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక రోగులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.