Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రవ్యాప్తంగా 21 వేల టీచర్ పోస్టులు ఖాళీ
- ఖాళీ పోస్టుల్లో భర్తీకాని విద్యావాలంటీర్లు
- చాలా స్కూల్స్‌కు అందని పాఠ్యపుస్తకాలు
నవతెలంగాణ - జిల్లాల ప్రతినిధులు
స్కూల్స్ ప్రారంభమై 19 రోజులైంది. ఇంకా సమస్యలతోనే ప్రభుత్వ స్కూల్స్ తడబాటుకు గురవుతున్నాయి. సెలవుల కంటే ముందే 'మన ఊరు మన బడి' ద్వారా ప్రభుత్వ స్కూల్స్‌ను మెరుగుపరుస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. చాలాచోట్ల అడుగుముందుకు పడలేదు. ఆ పనులు ఎప్పుడు పూర్తవుతాయో లేదో తెలియదు. బడులను శుభ్రపరిచే స్వచ్ఛ కార్మికులు లేరు. చాలా స్కూల్స్‌కు పాఠ్యపుస్తకాలు అందలేదని విద్యార్థులు చెందుతున్నారు. ఇదిలా ఉంటే స్కూల్స్ ప్రారంభం నాటికే ఖాళీ పోస్టుల్లో విద్యావాలంటీర్లను నియమిస్తామని అధికారులు చెప్పినా ఇప్పటివరకు దానికి సంబంధించిన ఏర్పాట్లు జరగలేదు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 21 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే, ఈ ఏడాది ఇంగ్లీషు మీడియం ప్రారంభించడంతో ప్రభుత్వ స్కూల్స్‌లో విద్యార్థుల సంఖ్య కూడా భారీగానే పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఖాళీల చోట్ల ప్రభుత్వ టీచర్లను భర్తీ చేయడం ఆలస్యమవుతుందని, ఈ లోపులో విద్యావాలంటీర్లను త్వరలో నియమిస్తామని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. అయితే, పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గతంలో అనుమతించిన విద్యావాలంటీర్ల కంటే మరికొంతమందిని అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఖాళీ పోస్టుల విషయంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికూనా ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం, విద్యాశాఖ చొరవ తీసుకోవాలని టీచర్స్ సంఘాలు, టీచర్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 21,500 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో స్కూల్ అసిస్టెంట్లు 7111, ఎస్జీటీ 6975 పోస్టులు భర్తీ కావల్సి ఉంది. ఇంకా 484 ఎంఇఓ పోస్టులకు గాను 467 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. జిహెచ్ఎమ్ గ్రేడ్-2కు సంబంధించి 1947, గ్రేడ్-1కు సంబంధించి 16కు గాను 15 , ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం పోస్టులు 2043 ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ డిఇ 62కు గాను 58, పిఇటి పోస్టులు 99 ఖాళీగా ఉన్నాయి. సంస్కృతంలో 23 పోస్టులు ఉంటే మొత్తం ఖాళీగానే ఉన్నాయి. ఆర్ట్ డ్రాయింగ్ 331, క్రాప్ట్ ఇన్‌స్ట్రక్చర్ 443 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇలా అనేక విభాగాల్లో ఏండ్ల తరబడి పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడం పట్ల టీచర్ కోర్సు పూర్తి చేసిన ఎంతోమంది ఆవేదన చెందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే ..ఖమ్మం జిల్లాలో 5, 759 ఉపాధ్యాయ పోస్టులుండగా 4,702 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 1,057 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అత్యధికంగా ఎస్జీటీ తెలుగు 342 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2372 పోస్టులు ఖాళీగా ఉంటే ఇందులో ఎస్జిటీ లు 816 ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం ఖాళీలు 803 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు 187, ఎస్జీటీలు 616 వరకు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో మొత్తం ఉపాధ్యాయుల పోస్టులు 3174 ఉంటే ప్రస్తుతం పని చేస్తున్న వారు 2689. ఖాళీలు 478 ఉన్నాయి. పెద్దపల్లిలో 168 పోస్టులు, జగిత్వాలలో 666, రాజన్నసిరిసిల్లలో 338 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11484 మంది ఉపాధ్యాయులు ఉండగా 991ఖాళీలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ జిల్లాలో 803 ఖాళీలుంటే, అందులో స్కూల్ అసిస్టెంట్లు 187, ఎస్జీటీలు 616 ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2372 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఎస్జీటీలు 816 ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. కామారెడ్డిలో 1119 పోస్టులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో2279 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సూర్యాపేటలో 600, యాదాద్రి భువనగిరిలో 700, నల్లగొండలో 979 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.