Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయుల కొరతతో పాఠశాల ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా
- ఉపాధ్యాయులు లేని పాఠశాల మాకొద్దు
- ఎంఈఓ హామీతో ఆందోళన విరమణ
నవతెలంగాణ-బోనకల్
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)లోని ప్రభుత్యోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బుధవారం ఉదయం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని.. అధికారులు, విద్యా కమిటీ చైర్మెన్లకు విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా నియమించకపోవడంతో చివరకు తల్లిదండ్రులు ఆ పాఠశాలకు ఉదయం ఎనిమిది గంటలకు తాళం వేశారు. ఉపాధ్యాయులను ఎవరిని పాఠశాలలోకి వెళ్ళనీయకుండా రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులు లేని ఈ పాఠశాల మాకొద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఈ పాఠశాలలో 152 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. వీరికి అనుగుణంగా 12 మంది ఉపాధ్యాయులు ఉండాలని, కానీ పీఈటీతో కలిపి ఏడుగురు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఈ పాఠశాలలో 5వ తరగతి వరకు తెలుగు మీడియం, ఐదు ఇంగ్లీష్ మీడియం ఉండగా.. వారిలో.. ప్రధానంగా పీజీ హెచ్ఎం పోస్ట్, హిందీ, తెలుగు, బయాలజీ, సోషల్ సబ్జెక్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆరోపించారు. తెలుగు మీడియం ఉపాధ్యాయులే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఒకే గదిలో కూర్చోబెట్టి విద్యా బోధన చేస్తున్నారని, అయినా శక్తికి మించి విద్యాబోధన చేసుకుంటూ మంచి ఫలితాలను సాధిస్తున్నారని చెప్పారు. గతేడాది నుంచి ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాగా, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, ఎంఈవో ఎం. ఇందిరాజ్యోతి దృష్టికి ఆ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు పి రాజ్యలక్ష్మి ఫోన్లో వారికి వివరించారు. వెంటనే ఎంఈఓ పాఠశాలకు చేరుకొని జులై మొదటి వారంలో ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపిస్తామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉమ్మనేని బాబు, విద్యా కమిటీ చైర్మెన్ కారంగుల లక్ష్మణ్, మాజీ విద్యా కమిటీ చైర్మెన్ తమ్మారపు లక్ష్మణ్, తెలంగాణ రైతు సంఘం మాజీ మండల అధ్యక్షులు కళ్యాణపు శ్రీనివాసరావు, సీపీఐ(ఎం) గ్రామ కమిటీ కన్వీనర్ ఉమ్మనేని రవి, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులను పాఠశాలకు ఎలా పంపించాలి :
విద్యా కమిటీ చైర్మెన్ లక్ష్మణ్
రెండేండ్ల నుంచి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల విద్యార్థులు ప్రయివేటు పాఠశాలలకు వెళ్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎంతో గొప్పగా ప్రకటనలు చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలి.
ఆంగ్ల విద్యా బోధన అర్థం కావటం లేదు:
10వ తరగతి విద్యార్థులు
తెలుగు మీడియం ఉపాధ్యాయులే ఇంగ్లీష్‌లో విద్యా బోధన చేస్తున్నారని పదో తరగతి విద్యార్థులు మామిళ్ళ కీర్తి, ఎర్రబోయిన సాయి రమ్య, దువ్వల చైతన్య, బోయల మంజుల తెలిపారు. సబ్జెక్టులు ఉపాధ్యాయులు లేక పదవ తరగతిలో తక్కువ మార్కులు వచ్చి గ్రేడులు తగ్గిపోతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో కొంతమంది తల్లిదండ్రులు కూలి పనులకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులను నియమించాలని కోరుతున్నారు.