Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
- 'సాలుమోడీ..సంపకుమోడీ' అంటూ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు
- 'సాలుదొర..సెలవుదొర' పేరుతో కేసీఆర్‌పై బీజేపీ కౌంట్‌డౌన్ డిజిటల్ బోర్డు
- బీజేపీ కార్యాలయానికి 55 వేల జరిమానా విధించిన జీహెచ్ఎంసీ
- ఫ్లెక్సీలపై ఫిర్యాదు చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఫ్లెక్సీవార్ తారాస్థాయికి చేరుకున్నది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద 'సాలు దొర..సెలవుదొర' అనే పేరుతో కేసీఆర్ పాలనకు కౌంట్‌డౌన్ సూచించే డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా తామేం తక్కువ కాదంటూ టీఆర్ఎస్ పార్టీ నగరంలో పలుచోట్ల 'సాలుమోడీ..సంపకు మోడీ' అనే బైబైమోడీ హ్యాష్‌ట్యాగ్‌తో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. డిజిటల్ బోర్డు, ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి జీహెచ్ఎంసీ రూ.55 వేల జరిమానా విధించింది. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం, ఆ పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ పెట్టిన ప్లెక్సీలపై ఎన్ని జరిమానాలు విధించారో చెప్పాలని ప్రశ్నిస్తు న్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ముందస్తుగానే వాణి జ్య ప్రకటనల స్పేస్‌ను టీఆర్ఎస్ పార్టీ నాలుగో తేదీ దాకా బుక్ చేసినట్టు ప్రచా రం జరుగుతున్నది. రోడ్డు మధ్యభాగం, మెట్రో ఫిల్లర్లు, బస్షెల్టర్లు ఇలా ఏ జాగ ను కూడా వదలలేదు. ఆ బోర్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్ర మాలు, పథకాలు ప్రముఖంగా కనిపించేలా యాడ్స్‌ను ఏర్పాటు చేసింది. దీంతో కమలం పార్టీ నేతలకు ఏమి చేయాలో పాలుపోక రోడ్డు పక్కల, ముఖ్యమైన కూడళ్లలో మోడీ, అమిత్‌షా, నడ్డా, బండిసంజరు, కిషన్‌రెడ్డి, తదితర నేతల భారీ కటౌట్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయడం మొదలుపెట్టాయి. దీంతో వాటికి జీహెచ్ఎంసీ ఫైన్ విధిస్తూ పోతున్నది. అందులో భాగంగానే బీజేపీ నేతలు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కౌంట్‌డౌన్ డిజిటల్ బోర్డుకు జీహెచ్ఎంసీ అధికారులు రూ.50 వేల జరిమానా విధించారు. అనుమతులు తీసుకోకుండా డిస్ప్లే ఏర్పాటు చేయడం వల్లే జీవో 68 ప్రకారం జరిమానా విధించామని అధికారులు స్పష్టం చేశారు. డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసిన నాటి నుంచి దానిని తొలగించేందుకు పోలీసులు, జీహెచ్ఎంసి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పలు దఫాలుగా బీజేపీ నేతలను అధికారులు సంప్రదించినా ససేమిరా అనడంతో ఫైన్ వేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా కౌంట్ డౌన్ బోర్డును తాత్కాలికంగా నిలిపివేశారు. బీజేపీ నేతలు మాత్రం టెక్నికల్ సమస్య వల్లనే ఆగిందనీ, తాము నిలిపేయలేదని చెప్పారు. ఆ బోర్డును అట్లాగే ఉంచారు. పీవీసీ బ్యానర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్యూపీ) వస్తువుల వాడకాన్ని ఇటీవల పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఇది జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది. ఇప్పటికే బ్యానర్ల ఏర్పాటుపై నిషేధం కూడా ఉన్నది. ఈ క్రమంలో చట్టాలను చేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నిబంధనలను అతిక్రమిస్తే పర్యావరణ పరిరక్షణ ఎలా సాధ్యమని సామాన్య ప్రజానీకం ప్రశ్నించే పరిస్థితి రానుంది.
బీజేపీ స్ట్రాంగ్ బుల్డోజర్..అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం :
బీజేపీ ఎల్పీ నేత రాజాసింగ్
రాష్ట్రంలో బీజేపీ స్ట్రాంగ్ బుల్డోజర్గా తయారైందని, టీఆర్ఎస్ నేతలు తమకు అడ్డొస్తే తొక్కుకుంటూ ముందుకెళ్తామని బీజేపీఎల్పీ నేత రాజాసింగ్ హెచ్చరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటుచేశామన్నారు. తమకు అవకాశం కల్పించ కుండా అన్నింటినీ టీఆర్ఎస్ బ్లాక్ చేయడం కుట్రపూరితమేనన్నారు. తమ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ఫైన్లు వేయడాన్ని ఖండించారు. కేసీఆర్ టైం దగ్గర పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు టీఆర్ఎస్ వాళ్లు మర్యాదపూర్వకంగా తొలగించాలని సూచించారు.