Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులు, హమాలీలు, మిల్లర్లే సమిధలు
- రాష్ట్రంలో 1500కిపైగా మూతపడ్డ రైస్‌మిల్లులు
- ఉపాధి లేక రోడ్డున పడ్డ 1.50 లక్షల మంది కార్మికులు
- సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయకపోవడం వల్లే సమస్య
- బదనాం చేసేందుకే అంటున్న ఎఫ్‌సీఐ
ఉప్పిడి బియ్యం (బాయిల్డ్ రైస్) కొనుగోలు దగ్గర మొదలైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ధాన్యం కొనుగోలు సమయంలో మడతపేచీలతో మొదట రైతులు నలిగిపోగా...ఇప్పుడు బియ్యం దగ్గరకొచ్చేసరికి మిల్లర్లు, హమాలీలు, కార్మికుల వంతైంది. రాష్ట్రంలో కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కొనుగోలు ప్రక్రియను నిలిపివేయడంలో ఇక్కడ దాదాపు సగం రైస్‌మిల్లులు మూతపడ్డాయి. ఫలితంగా మిల్లులపై ఆధారపడి జీవిస్తున్న 1.50 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. నెల నుంచి పనుల్లేక వలస కార్మికులు సొంతరాష్ట్రాల బాట పట్టారు. ఒకరిపై ఒకరు బురద జల్లుకునే పనిలో టీఆర్ఎస్, బీజేపీలు పడ్డాయి.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో 3,200కిపైగా రైసుమిల్లులున్నాయి. అందులో రెండు వేల మిల్లుల నుంచి సీఎంఆర్ రైసును ఎఫ్‌సీఐ, సివిల్సప్లరు విభాగాలు కొనుగోలు చేస్తున్నాయి. ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మడత పేచీతో ధాన్యం కొనుగోలు విషయంలో తీవ్ర అలసత్వం జరిగింది. దీంతో రైతులు చాలా ఇబ్బందిప డ్డారు. ధాన్యం కూడా చాలా మేరకు తడిసింది. రైతుల ఆగ్రహం ఎక్కడకు దారితీస్తుంతో అనే భయంతో రాష్ట్ర ప్రభుత్వం 6,609 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. వాటిని రైసుమిల్లులకు చేర్చింది. బియ్యం సరఫరాలో మిల్లులు క్వాలిటీ, కాంటిటీ విషయంలో సరైన ప్రమాణాలు పాటించట్లేదు.. ఎఫ్‌సీఐకి నాసిరకం బియ్యాన్ని ఇస్తూ, బయట నాణ్యమైన వాటిని అమ్ముకుంటున్నాయని ఆరోపిస్తూ ఎఫ్‌సీఐ కొనుగోళ్లను ఆపింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు మిల్లుల్లో తనిఖీలు చేపట్టింది. ఆ సమయంలో మిల్లులను తెరవొద్దని ఆదేశించింది. ఇదంతా రాష్ట్రాన్ని బదనాం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేయిస్తున్న పని అని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. కరోనాకాలంలో కేంద్రం ఐదుకేజీలు, రాష్ట్ర ప్రభుత్వం ఐదు కేజీల చొప్పున రేషన్‌కార్డు దారులకు బియ్యాన్ని ఇచ్చారు. ఏప్రిల్, మే నెలలో రాష్ట్రంలో ఆ పంపిణీ జరగలేదు. జూన్ 18 నుంచి రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది. ఏప్రిల్, మే నెలల్లో ఎందుకు పంచలేదు? గోదాముల్లోని వాటినే ఖాళీ చేయలేదు? వాటి లెక్కలివ్వాల్సిందే అంటూ ఎఫ్‌సీఐ ఈ నెల ఏడో తేదీ నుంచి సీఎంఆర్ బియ్యం సేకరణను నిలిపేసింది. 26 రోజుల నుంచి 1500 మిల్లులు మూతపడ్డాయి. దీంతో ఆ మిల్లులపై ఆధారపడి జీవిస్తున్న 1,50,000 మంది కార్మికులు(హమాలీలు, మిల్లుల ఆపరేటర్లు, గుమాస్తాలు, దినసరికూలీలు, ట్రాన్స్‌పోర్టు రంగం కార్మికులు, గోదాంలలో పనిచేసే హమాలీలు, తదితర విభాగాల వాళ్లు) రోడ్డున పడ్డారు. వీరిలో ఎక్కువగా వలసొచ్చిన కార్మికులే(70 శాతందాకా) ఉన్నారు. మిల్లులు నిలిపేయడంతో వారంతా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. వారి పిల్లల చదువులు ఆగమవుతున్నాయి.
ఎత్తులకు పై ఎత్తులు
యాసంగిలో సేకరించి మిల్లుల ఆవరణల్లో నిలువ చేసిన ధాన్యం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్నాయి. దీంతో ధాన్యం, బియ్యం ఆగమవుతున్నాయి. ధాన్యం రంగుమారుతున్నది. కొన్ని చోట్ల మొలకలెత్తిన ఘటనలు కూడా ఉన్నాయి. బస్తాల్లోని బియ్యం కూడా గడ్డలు కట్టి ముక్కిపోతున్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమో, కేంద్రం పరిధిలోని ఎఫ్సీఐనో కొనుగోలు చేసే సమయంలో తడిసాయనే నెపంతో మళ్లీ కొర్రీలు పెట్టే ప్రమాదమున్నది. మిల్లర్ల గగ్గోలు పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్‌రావుతో సమావేశం ఏర్పాటు చేయించింది. రాష్ట్ర ప్రభుత్వం హామీలిచ్చినా, సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. మరోవైపు రాష్ట్రం నుంచి బియ్యం కొనుగోలు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర సర్కారు కేంద్రంపై బాణాన్ని ఎక్కుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఉచిత బియ్యాన్నే ఇంకా పంచలేదు? ఇప్పుడు సేకరించి ఏం చేయాలి? ఎక్కడ పెట్టాలి? అని కేంద్రం రాష్ట్రాన్ని ప్రశ్నిస్తున్నది. కేంద్రం వద్ద కొనుగోలు చేయాలని మోకరిల్లడమేంటి? ధాన్యం కొనుగోలు చేశాం..నష్టాన్ని భరించి మిల్లర్లకే బియ్యాన్ని ఇచ్చేస్తే అయిపోతుందనే ఆలోచనకు రాష్ట్ర సర్కారు వచ్చినట్టు సమాచారం. అదే జరిగితే మిల్లర్లు రాష్ట్ర సర్కారు పక్షాన నిలిచే అవకాశం ఉంది. టీఆర్ఎస్కు మైలేజ్ దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నది. మూడో తేదీన పెరేడ్ గ్రౌండ్లో జరిగే బీజేపీ బహిరంగ సభలో బియ్యం కొనుగోలు విషయంపై ప్రధాని మోడీతో స్పష్టమైన హామీ ఇప్పించి మిల్లర్లను మచ్చిక చేసుకునే పనిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ రైసాటలో నలిగిపోతున్న రైతులు, కార్మికులు, మిల్లర్ల కష్టాలను చూసైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బియ్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయాలి
భద్రాద్రి రాములు, నల్లగొండ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి
ఎఫ్‌సీఐ వెంటనే బియ్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలి. ఇప్పుడు మొదలుపెట్టినా సేకరణకు 14 నెలలు పడుతుంది. ఇప్పటికే మిల్లులు మూతపడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాం. మిల్లులు నడవకపోయినా లక్షలకు లక్షల కరెంటు బిల్లులు కట్టాల్సి వస్తున్నది. కరెంటుబిల్లు, మెయింటనెన్స్ కలిపి నెలకు రూ.40 లక్షల దాకా భారం పడుతున్నది. ఇలాగే ఇంకొద్ది రోజులుంటే రైస్‌మిల్లు పరిశ్రమ సంక్షోభంలోకి కూరుకుపోవడం ఖాయం. నూకల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని హామీనివ్వడం సంతోషమే కానీ, త్వరితంగా బియ్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
రైస్‌మిల్లు కార్మికుల సమస్యలపై
జులై ఒకటో తేదీన కలెక్టరేట్ల ముట్టడి
తక్షణమే సీఎంఆర్ కొనుగోలు ప్రక్రియను ఎఫ్‌సీఐ ప్రారంభించాలి. మూతపడ్డ మిల్లులను వెంటనే తెరిపించి కార్మికులకు తిరిగి ఉపాధి కల్పించాలి. మూతపడ్డ కాలానికి వేతనాలు, కూలి చెల్లించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నిందలు మోపుకుంటూ రైస్‌మిల్లు పరిశ్రమను, రైతులను, కార్మికులను రోడ్డున పడేస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. వలస కార్మికులను ఆదుకునేందుకు తీసుకొచ్చిన అంతర్రాష్ట్ర కార్మిక చట్టాలను పాలకులు తుంగలో తొక్కారు. తక్షణమే రైస్‌మిల్లుల్లో పనిచేసే కార్మికుల సమస్యను పరిష్కరించకపోతే జులై ఒకటో తేదీన రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తాం. పోరాటాలను ఉధృతం చేస్తాం.
- తుమ్మల వీరారెడ్డి,
తెలంగాణ హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు