Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన ధరలతో వంట చేయలేమన్న ఏజెన్సీ
- కొద్ది రోజులు వండి పెట్టిన ఉపాధ్యాయులు
- ఇక చేయలేమన్న పంతుళ్లు
- మండల విద్యాధికారి ప్రయత్నం విఫలం
- ఇంటి నుంచి టిఫిన్ బాక్స్‌లతో వస్తున్న విద్యార్థులు
- ఈ స్కీం ప్రయోజనమే దెబ్బతింటుంది: సీఐటీయూ
నవతెలంగాణ- నార్కట్‌పల్లి
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి.. ప్రభుత్వం మాత్రం పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజన పథకం నిధులు పెంచడం లేదు. వంట చేసే ఏజెన్సీలకు కనీసం రోజు కూలి పడటం లేదు.. ఇచ్చే బిల్లులూ ఆరు నెలలకోసారి ఇస్తోంది.. గౌరవ వేతనమూ ఎనిమిది నెలలుగా అందడం లేదు.. దుకాణంలో ఉద్దెర కూడా ఇవ్వడం లేదంటూ.. ఇక తాము వంట చేయలే మంటూ నిర్వాహకులు లేదు.. దుకాణంలో ఉద్దెర కూడా ఇవ్వడం లేదంటూ.. ఇక తాము వంట చేయలే మంటూ నిర్వాహకులు మధ్యాహ్నం భోజనం బంద్ చేశారు. చేసేది లేక పిల్లల కడుపు నింపేందుకు ఉపాధ్యాయులే వంట మాస్టార్ల అవతారం ఎత్తారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలోని బ్రాహ్మణవెల్లంల ఆవాస గ్రామమైన కొత్తగూడెంలో జరిగింది. కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో గతంలో మధ్యాహ్న భోజన పథకం బాధ్యతలు ప్రియాంక సమభావన సంఘం సభ్యులు చిరుమర్తి ముత్తమ్మ, చిరుమర్తి రత్నమాల నిర్వహించారు. అయితే, ఈ ఏడాది నిత్యావసర వస్తువుల పెరుగుదల.. ప్రభుత్వం నుంచి అరకొరగా వచ్చే బిల్లులతో వంట చేయలేమని వారు చేతులెత్తేశారు. పాఠశాలలో మొత్తం 117 మంది విద్యార్థులు ఉండగా.. అందులో బాలురు 69 మంది బాలికలు, 48 మంది బాలురులు ఉన్నారు. ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 117 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకుగాను ఉపాధ్యాయులే వండి పెట్టారు. జూన్ 13 నుంచి 20వ తేదీ వరకు ఉపాధ్యాయులే సొంత డబ్బులతో అంగన్వాడీ పాఠశాల ఆయా సహాయంతో వంటచేశారు. ఓవైపు పాఠాలు చెబుతూనే.. మరోవైపు మధ్యాహ్నం వంట తయారు చేశారు. అయితే, పాఠాలు చెప్పడం, వంట చేయడం సాధ్యం కాదని, దాంతోపాటు తాము ఇక పెట్టుబడి కూడా పెట్టలేమని ఉపాధ్యాయులు విద్యార్థులకు, అధికారులకు చెప్పారు. 21 నుంచి 28 వరకు విద్యార్థులు ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకున్నారు. 29, 30 తేదీల్లో వంట చేసిన టీచర్లు జులై నుంచి చేయలేమని తేల్చి చెప్పారు. మళ్లీ విద్యార్థులు ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకోవాల్సిందే.
మండల విద్యాధికారి ప్రయత్నం విఫలం
మధ్యాహ్న భోజనం అమలుపై మండల విద్యాధికారి కుకుట్ల నరసింహా ఏఈపీఎం కృష్ణతో కలిసి గ్రామానికొచ్చారు. సమభావన సంఘాల సభ్యులతో గతనెల 27న పాఠశాలలో సమావేశం నిర్వహించారు. లాటరీ ద్వారా ఎంపిక చేసి గంగోత్రి సమ భావన సంఘాల వారు వంట చేసే విధంగా తీర్మానం చేశారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు.. మార్కెట్లో వస్తువులకు పొంతన లేనందున తాము కూడా వంట చేయలేమని వారూ రావడం లేదు.
వంట చేయలేమన్న ఏజెన్సీ
మధ్యాహ్న భోజన పథకంలో ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం నాలుగు రూపాయల 97 పైసలు ఇస్తుంది. అయితే, ఆ డబ్బులు పెరుగుతున్న నూనె, పప్పు, కూరగాయ ధరలకు ఏ మూలకూ సరిపోవడం లేదు. పైగా ఆ బిల్లులు కూడా ఆరు మాసాలకుపైగా ఆపడంతో.. పెట్టుబడి డబ్బులు లేక షాపు నిర్వాహకులు నెలల తరబడి ఉద్దెర ఇవ్వడం లేదని ఏజెన్సీ నిర్వాహకులు పేర్కొంటున్నారు. అందుకే వంట చేయలేమని చెప్పారు.
గుడ్డుకు చెల్లించేది రూ.4.. మార్కెట్లో రూ.6
పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థికీ సంపూర్ణ ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో వారానికి మూడ్రోజులపాటు గుడ్డు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలో పెట్టింది. కానీ నిత్యం గుడ్డు ధర మారుతుండటంతో మారుతున్న ధరలకు అనుగుణంగా ఏజెన్సీ వారికి ప్రభుత్వం చెల్లించడం లేదు. వారంలో రెండు రూపాయలు అదనంగా ఏజెన్సీ వారు చేతి నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. గత సంవత్సరం అక్టోబర్ నుంచి నేటి వరకు గుడ్డు బిల్లును ఏజెన్సీ వారికి చెల్లించలేదు. నెలకు 1000 రూపాయల చొప్పున అందించే గౌరవ వేతనం కూడా ఎనిమిది నెలలుగా అందలేదు.
ఇంటి నుంచి టిఫిన్ బాక్స్‌లతో విద్యార్థులు
పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు ఇండ్ల నుంచి టిఫిన్ బాక్స్‌లు తెచ్చుకుంటున్నారు. అయితే, నిరుపేదల విద్యార్థులు కొందరు మధ్యాహ్నం ఖాళీ కడుపుతోనే ఉంటున్నారు. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ (ఎం.డీ.జీ.) లక్ష్యాలనే ఇది దెబ్బతీస్తుందని సీఐటీయూ ఆవేదన వ్యక్తం చేసింది.
గ్రామంలో ఎవరూ ముందుకు రావడం లేదు
మండల విద్యాధికారి కూకట్ల నరసింహా
మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నడిపించేందుకు గ్రామంలో ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతిరోజూ ఒక్కొక్కరికి 200 రూపాయల చొప్పున ఇద్దరు మహిళలకు ఇస్తామని చెప్పినప్పటికీ ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. అందువల్ల మధ్యాహ్న భోజన పథకం అమలు చేయలేకపోతున్నాం.