Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుస్నాబాద్
పొడిగొట్టిన బతుకుల్లో తడిబారేందుకు సర్వం వదులుకున్న గౌరవెల్లి భూ నిర్వాసితుల చేతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంతో ఇండ్లు, భూములు కోల్పోయి ఏండ్లు గడుస్తున్నా.. సర్కార్ పరిహారం, సరైన పునరావాసం కల్పించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో భూ నిర్వాసితులు కొట్టుమిట్టాడుతు న్నారు. తమకు న్యాయంగా రావాల్సిన పరిహారం కోసం ఇటీవల ఆందోళన చేయడంతో పోలీసులు పలువురు భూనిర్వాసితులపై కేసు నమోదు చేశారు. గురువారం హుస్నాబాద్‌లోని కోర్టుకు బేడీలతో రైతులను తీసుకురావడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలో భాగంగా జరిగిన ఘర్షణలో నిర్వాసితులు హుస్నాబాద్ ఏసీపీ సతీష్‌పై దాడిచేశారన్న కేసులో.. గుడాటిపల్లి గ్రామానికి చెందిన బద్దం శంకర్‌రెడ్డి, అంగిటి తిరుపతిరెడ్డి, రాగి శ్రీనివాస్, భూక్యా సక్రులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు వారిని ఈ నెల 13న అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌లో భాగంగా కరీంనగర్ జైలుకు తరలించారు. గురువారం హుస్నాబాద్ కోర్టులో న్యాయమూర్తి వీరికి మరో 14 రోజుల రిమాండ్ విధించారు. కొద్ది రోజులుగా గౌరవెల్లి ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లో నిర్వాసిత కుటుంబాలను ఎందుకింత క్షోభ పెడుతున్నారని సీపీఐ(ఎం), కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పరిహారం అడిగిన నిర్వాసితులపై అక్రమంగా కేసులు బనాయించడం టీఆర్ఎస్ సర్కార్కే చెల్లిందని సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గతంలో రైతుల కాళ్లకు బేడీలు వేసిన పార్టీకి పట్టిన గతే టీఆర్ఎస్కూ పడుతుందన్నారు. నిర్వాసితులకు సంకెళ్లు వేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.