Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు ఎన్.పెరియార్ స్వామి
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలతో కేంద్రంలోని మోడీ సర్కార్ సామాన్యుల నడ్డి విరుస్తోందని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పెరియార్ స్వామి అన్నారు. సంక్షేమ బడ్జెట్లో భారీ కోతలు విధించడం వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ సామాన్య ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌లోని బోడుప్పల్ మున్సిపాల్టీలోని ఎస్ఎస్ఎస్ గార్డెన్స్, కామ్రేడ్ గుండా మల్లేష్ హాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 'వ్యవసాయ కార్మికుల సమస్యలపై' నిర్వహించిన రెండు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ ముగింపు సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మోడీ తిరోగమన విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఉత్పత్తి క్షీణించి, సేవా రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, ప్రభుత్వ రంగాల ప్రయివేటీకరణే ఎజెండాగా ముందుకు సాగుతోందన్నారు. దేశంలో ఆకలి, పేదరిక సూచిక దేశ ప్రజల దుర్భరమైన దుస్థితికి అద్దం పడుతోందన్నారు. ఇవేవీ పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ పాలకులు మతతత్వ ఎజెండా అమలు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు. దళిత, గిరిజనులు, మైనారిటీలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, అన్ని రాజ్యాంగ హక్కులు, పౌర హక్కులు నిర్మొహమాటంగా ఉల్లంఘించ బడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలానుగుణంగా పొలం పనులు దొరికితే పూట గడవడం, లేకుంటే పస్తులుండటం వ్యవసాయం రంగంలో నేడు పరిపాటిగా మారిందన్నారు. దేశంలో 64 శాతంగా ఉన్న వ్యవసాయ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాలు నిర్మించాలని పెరియ స్వామి పిలుపునిచ్చారు.
అనంతరం గద్దర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ రైతులను దగా చేస్తున్నదని ప్రజాగాయకుడు గద్దర్ విమర్శించారు. పోరాడి సాధించుకున్న భూములు నేడు వెరొకరి పేరుతో ఉన్నాయని ఆరోపించారు. మా భూములు మాకే కావాలంటూ ధరణి పోర్టల్‌కు వ్యతిరేకంగా ఇంటింటా పోరాటం మొదలైందని, దానికి మద్దతు ఇస్తూ ఎర్ర జెండా పార్టీలు పోరాటం చేయాలని కోరారు. వర్క్‌షాప్‌లో బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు టి.వెంకట్రాములు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు కలకొండ కాంతయ్య, ఎన్. బాలమల్లేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటి వెంకటేశ్వర్ రావు, అక్కపల్లి బాబు, ఎం. తాజుద్దీన్, కార్యదర్శులు బుద్దుల జంగయ్య, సృజన కుమార్, చింతకుంట్ల వెంకన్న, యేసయ్య, దుబ్బాసు రాములు, సమితి సభ్యులు మోతె జాంగారెడ్డి, నాయకులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.