Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరందించాలి : జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమకాల్వపై ఉన్న లిఫ్టులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందన్న హామీని అమలు పరచాలనీ, ప్రాజెక్టు ఆధునీకరణలో అంతర్భాంగా అభివృద్ధి పరచి లిఫ్టుల పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. లిఫ్టుల కింద స్థిరీకరించిన ఆయకట్టులో సగం భూములకు కూడా సాగునీరు అందక బీళ్ళుగా మారినవని తెలిపారు. లిఫ్టులు సరైన నిర్వహణ, అవసరమైన సిబ్బంది లేక శిధిలావస్థకు చేరుకున్నాయని పేర్కొన్నారు. కాలువలు, బావులు పూడిపోయి, కంపచెట్లతో నిండిపోయినవనీ, మోటార్లు, స్టార్టర్లు, మీటర్లు తుప్పుపట్టినవని వివరించారు. ఇరిగిన స్తంభాలు, చెట్ల పొదలతో కరెంటు లైన్లు అస్తవ్యస్థంగా తయారయ్యాయని తెలిపారు. ఇటీవల రైతులు తీవ్ర ఆవేదనతో నల్లగొండలోని ఐబీసీఈ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని లిఫ్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపధికన మరమ్మతులు చేపట్టాలని కోరారు. లిఫ్టుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ప్రభుత్వమే నియమించాలని విన్నవించారు. కాలువలు, బావుల్లో పూడిక తీయించాలనీ, తూములు, షటర్స్, కాలువ కట్టలు, రహదారులు బాగు చేయించాలని కోరారు. లిఫ్టుల నిర్వహణను ఐడిసికి అప్పగించి, ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్లైన్లను మెరుగుపర్చాలని కోరారు.