Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్/బాసర
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, అందుకు సహకరించిన ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) అభినందనలు తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ కారణంగా గతేడాది చదువు సక్రమంగా సాగకున్నా విద్యార్థులు ఈ ఏడాది కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించారని తెలిపారు. వందశాతం ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు గణనీయమైన సంఖ్యలో (1,507) ఉన్నాయని వివరించారు. సున్నా ఫలితాలు వచ్చిన పాఠశాలలు స్వల్పంగా ఆరు ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల అత్యుత్తమ బోధన ఫలితంగా మోడల్ స్కూళ్లు, ఆవాస పద్ధతిలో విద్యాబోధన సాగించిన గురుకులాలు, కేజీబీవీల్లో ప్రయివేటు పాఠశాలలకు మిన్నగా ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. కేజీబీవీ ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వకున్నా జిల్లా పరిషత్ పాఠశాలల్లో సగటున మూడు సబ్జెక్ట్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం విద్యావాలంటీర్లను నియమించకున్నా ఉపాధ్యాయులు పనిని సర్దుబాటు చేసుకుని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు కష్టపడి బోధించిన ఫలితంగా సంతృప్తికరమైన ఫలితాలు సాధించారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు అన్ని వసతులూ కల్పించి, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి, పర్యవేక్షణ అధికారులను నియమిస్తే ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు రాబట్టగలరని ఈ ఫలితాల ద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే ఖాళీపోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. తద్వారా నేషనల్ అచీవ్ మెంట్ సర్వే, పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ రిపోర్టుల్లో తెలంగాణ ర్యాంకును మెరుగుపరుచుకోగలుగుతామని సూచించారు.