Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితురాలి రూ. 11 లక్షలు కాపాడిన పోలీసులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మోసపూరితంగా ఒక మహిళా అకౌంట్ నుంచి రూ. 11 లక్షలను స్వాహా చేయబోయిన సైబర్ ఫ్రాడర్స్కు సైబర్ క్రైమ్ పోలీసులు చెక్ పెట్టారు. బాధితురాలి నుంచి మోసగాళ్ల అకౌంట్లోకి డబ్బులు వెళ్లకుండా సాంకేతికంగా అడ్డుకున్నారు. సైబర్ క్రైమ్ అధికారుల కథనం ప్రకారం.. ప్రేరణ అనే మహిళకు ఎక్కువ డబ్బు లాభాల ఆశ చూపి బిట్కాయిన్స్లో పెట్టుబడి పెట్టేలా సైబర్ మోసగాళ్లు కుట్ర పన్నారు. మోసగాళ్లు తెలిపినట్టుగానే అడపా దడపా రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వాళ్ల అకౌంట్లో ప్రేరణ జమ చేయసాగింది. ఈ విధంగా దాదాపు రూ. 11 లక్షల లను ఆన్లైన్లో జమ చేసింది. తర్వాత తాను మోసపోయినట్టు గ్రహించిన ప్రేరణ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన తెలంగాణ సైబర్ క్రైమ్ సెంటర్ అధికారులు వెంటనే సాంకేతిక పరిజ్ఞానంతో మోసగాళ్ల అకౌంట్లోకి రూ. 11 లక్షలు వెళ్లకుండా అడ్డుకుకున్నారు. సంబంధిత బ్యాంకు అధికారులకూ సమాచారమందించారు. దీంతో సైబర్ మోసగాళ్ల అకౌంట్లోకి డబ్బు వెళ్లకుండా సంబంధిత బ్యాంకు అధికారులు చర్యలు తీసుకున్నారు. తిరిగి బాధితురాలు ప్రేరణ అకౌంట్లోకి డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, 2016 నుంచి ఇప్పటి వరకు పలువురు బాధితుల నుంచి సైబర్ మోసగాళ్లు ఆన్లైన్ ద్వారా దండుకోవాలని చూసిన రూ. 17 కోట్లకు పైగా డబ్బులను సైబర్ క్రైమ్ పోలీసులు ఆధునిక టెక్నాలజీతో అడ్డుకున్నారు. ఇందుకు వివిధ బ్యాంకులతో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరీ చర్యలకు పూనుకుంటున్నామని సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు.