Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో తేదీన ప్రధాని మోడీ రాక
- పలువరు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు, అగ్రనేతల రాక
- హైదరాబాద్‌లో కట్టుదిట్టంగా భద్రత.. నిఘానీడలో నోవాటెల్
- భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన సీఎస్ సోమేశ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైటెక్స్‌లోని నోవాటెల్‌లో శని, ఆదివారాల్లో జరుగనున్నాయి. త్వరలో ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధం, గత జాతీయ కార్యవర్గ సమావేశాల నుంచి నేటి వరకూ జరిగిన ముఖ్య పరిణామాలు, పార్టీ ఎత్తుగడలు, భవిష్యత్ కార్యాచరణ, కర్నాటక మాదిరిగా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు ఏం చేయాలి? అనే అంశాలే ప్రధాన ఎజెండాగా సమావేశాలు జరుగనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. సమావేశాలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరవ్యాప్తంగా ముఖ్యమైన కూడళ్లలో ఆ పార్టీ అగ్రనేతలతో కూడిన ఫ్లెక్సీలను బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ఆ పార్టీ సంస్థాగత కార్యదర్శి శివప్రకాశ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మురళీధర్‌రావు, ఇతర ముఖ్య నేతలు దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అతిథుల కోసం తెలంగాణలో ఫేమస్ అయిన ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ కోసం వేదిక, ఇతర పనులు కూడా జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు కేంద్ర క్యాబినెట్ మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున రానున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సికింద్రాబాద్‌లో అగ్నిపథ్ నిరసనల్లో ఆర్మీ పరీక్షలకు సన్నద్ధమతున్న అభ్యర్థులు పోలీసు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో, ఎస్సీ వర్గీకరణ కోసం సమావేశాల వద్ద నిరసన తెలుపుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ ప్రకటించిన క్రమంలో నిరసనలు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు శాఖ జాగ్రత్తలు తీసుకుంటున్నది. మోడీ, అమిత్‌షా, సీఎంలు, బీజేపీ పార్టీ అగ్రనేతలు వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై పోలీసు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్ గురువారం సమీక్ష నిర్వహించారు. నేటి నుంచి నాలుగో తేదీ వరకూ పోలీసులు నగరంలోని పలు చోట్ల గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఎస్పీజీతో పాటు ఇతర బలగాలను బందోబస్తుగా ఉంచుతున్నారు. నోవాటెల్ పరిసర ప్రాంతాల్లో నాలుగు లేయర్ల బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని వెళ్లే రూట్లో ప్రత్యేక నిఘా ఉంచారు. తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు, తెలంగాణ ఉద్యమం-బీజేపీ పోరాటాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. రెండో తేదీన మధ్యాహ్నం ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రానున్నారు. అదే రోజు నాలుగు గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమై రాత్రి వరకు కొనసాగుతాయి. మరుసటిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ప్రధాని ఉపన్యాసంతో ముగిస్తాయి. ఆ తర్వాత జరిగే విజయ సంకల్ప్ సభలో ప్రధాని ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. నాలుగో తేదీ ఉదయం ఏపీలోని భీమవరానికి వెళ్తారు.