Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బిజినెస్ బ్యూరో
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సులభ వ్యాపార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకులలో తెలంగాణ మరోమారు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వ్యాపార అనుకూల మార్గదర్శకాలు, నిబంధనల అమలు మేరకు జాతీయస్థాయిలో టాప్‌లో నిలిచింది. గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు తొలి స్థానాల్లో నిలిచాయి. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2020 అమలు ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆర్థిక శాఖ ర్యాంక్‌లు ప్రకటించింది. కాగా.. ఈ ర్యాంకుల కోసం కేంద్రం చేపట్టిన ప్రక్రియలో ఉన్న 301 మార్గదర్శకాల్లోనూ తెలంగాణకు నూటికి నూరు శాతం మార్కులు దక్కాయి. పరిశ్రమలకు లైసెన్సింగ్ విధానం, అనుమతులు, ప్రభుత్వ సహకారం, కార్మికులు, పర్యావరణం తదితర 15 విభాగాల్లో మొత్తం 301 మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇందులోనూ ఈసారి టాప్ అచీవర్స్, అచీవర్స్, అస్పైర్స్, ఎమర్జింగ్ బిజినెస్ ఈకోసిస్టమ్ అనే నాలుగు కేటగిరీలుగా విభజించి రాష్ట్రాలకు ర్యాంక్‌లను ఇచ్చారు. తెలంగాణకు ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యుత్తమ కేటగిరి టాప్ అచీవర్సులో స్థానం దక్కించుకుంది. తెలంగాణతో పాటు దేశంలోని పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు టాప్ అచీవర్స్ కేటగిరీలో స్థానం దక్కించుకున్నాయి.