Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముర్ము, సిన్హా మినహా మిగిలిన నామినేషన్లు తిరస్కరణ
- రేపు హైదరాబాద్‌కు సిన్హా
- యశ్వంత్‌కు ఘన స్వాగతం పలుకుదాం... : స్వాగత ఏర్పాట్లు, మద్ధతుసభపై కేటీఆర్ సమావేశం
నవతెలంగాణ బ్యూరో -ఢిల్లీ /హైదరాబాద్
రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాత్రమే పోటీలో ఉన్నారు. మిగిలిన వారి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు చేసేందుకు గడువు జూన్ 15న ప్రారంభమై జూన్ 29 (బుధవారం)తో ముగిసింది. దీంతో గురువారం నామినేషన్ల పరిశీలన చేశారు. అనంతరం ఇద్దరు అభ్యర్థులు ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా నామినేషన్లు మాత్రమే ఆమోదం పొందినట్టు రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి (రాజ్యసభ సెక్రెటరీ జనరల్) పిసి మోడీ తెలిపారు. మొత్తం 94 మంది అభ్యర్థుల నుంచి 115 నామినేషన్ పత్రాలు వచ్చాయని, అందులో 107 నామినేషన్ పత్రాలు ప్రమాణాలు పాటించనందున తిరస్కరించబడినట్టు ఆయన తెలిపారు.
నగర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ చర్చ
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు సిన్హాకు స్వాగత ఏర్పాట్లు, ఆయనకు మద్ధతుగా నిర్వహించే సభపై సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. యశ్వంత్‌కు ఘనంగా స్వాగతం పలకాలని టీఆర్ఎస్ నిర్ణయించిందని తెలిపారు.
సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
యశ్వంత్ సిన్హా సభ ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ పరిశీలించారు. అనంతరం రంజిత్ రెడ్డి మాట్లడుతూ ఉమ్మడి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం ఉదయం బేగంపేట ఎయిర్ పోర్ట్‌కి చేరుకుంటారు. ఆయనకు సీఎం కేసీఆర్, మంత్రులు స్వాగతం పలుకుతారు. ఐదారు వేల బైక్‌లతో ర్యాలీ జలవిహార్ చేరుకుంటుంది. సీఎం కేసీఆర్ ప్రసంగం తర్వాత.. యశ్వంత్ సిన్హా మాట్లాడుతారు. జలవిహార్‌లో సభ ముగిసిన తరువాత సిన్హా గాంధీ భవన్, ఎంఐఎం కార్యక్రమాలకు వెళ్తారు.