Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఆన్లైన్'లో చెల్లించండి : మంత్రి హరీశ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలు, వైద్యవిద్యార్థుల ఉపకారవేతనాల చెల్లింపులో ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు మాన్యువల్ బిల్లుల విధానం ద్వారా చెల్లింపులు జరుగుతుండటంతో కొంత ఆలస్యం జరుగుతున్నట్టు గుర్తించింది. బిల్లులను స్క్రూటినీ చేయడం, ఉన్నతాధికారులకు పంపడం, ప్రభుత్వం ఆమోదం తీసుకోవడం వంటి పద్ధతుల వల్ల జాప్యం జరుగుతున్నట్టు అధికారులు నిర్దారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో దీన్ని సమూలంగా నివారించేందుకు ఆన్లైన్ విధానంలో చెల్లింపులు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఇందుకోసం ప్రత్యేకంగా సాప్ట్వేర్ రూపొందించాలన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజరు కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆలస్యానికి కారణమవుతున్న మాన్యువల్ బిల్లుల విధానానికి స్వస్తి పలకాలని ఆర్థిక, ఆరోగ్య శాఖలకు ఆయన సూచించారు. తక్షణం ఆన్లైన్ విధానాన్ని రూపొందించాలి, రెండు శాఖలు సమన్వయం చేసుకొని ఏ నెలకు ఆ నెల వేతనాలు చెల్లింపులు జరిగే విధంగా చూడాలన్నారు. వేతనాలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా వేతనాల చెల్లింపులను సత్వరం చేసే అంశంపై అధికారుల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.