Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) బియ్యం సేకరణను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బియ్యం సేకరణను గతనెల ఏడు నుంచి ఎఫ్‌సీఐ నిలిపేసిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితంగా మిల్లర్ల వద్ద బియ్యం నిల్వలు పేరుకుపోయాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తగాదాల వల్ల మిల్లర్లు, రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్రంలో బియ్యం సేకరణను ఎఫ్‌సీఐ ప్రారంభించాలని కోరారు. 2022 యాసంగి ఉత్పత్తి 72 లక్షల టన్నులు కాగా, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 52 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించిందని వివరించారు. ఈ బియ్యాన్ని నిర్ణీత సమయంలో ఎఫ్‌సీఐకి పంపాలని కోరారు. మొదట బాయిల్డ్ రైస్ వద్దని చెప్పిన కేంద్రం, తిరిగి బాయిల్డ్ రైస్ తీసుకుంటామంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా ప్రకటన చేయించారని గుర్తు చేశారు. అయినా మిల్లర్లు ముడిబియ్యం పెట్టడానికి సిద్ధపడి బాయిల్డ్ రైస్‌ను తయారుచేయలేదని తెలిపారు. గతనెత 30 వరకూ సమయం ఉండగా మూడు వారాల ముందే, గతనెల ఏడున ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ బంద్ చేసిందని పేర్కొన్నారు. మరోవైపు
మిల్లర్లపై ఆరోపణ చేస్తున్నదని విమర్శించారు. నాణ్యత లేని బియ్యాన్ని ఎఫ్‌సీఐకి పెడుతూ, నాణ్యత గల బియ్యాన్ని బయట మార్కెట్లో అమ్ముకుని మిల్లర్లు లాభాలు గడిస్తున్నారని ఆరోపణలు చేసిందని తెలిపారు. గతనెల ఒకటి నుంచి ఐదు వరకు మిల్లర్లను ఎఫ్‌సీఐ తనిఖీలు చేసిందని పేర్కొన్నారు. ఆ విధంగా రాష్ట్రంలో రెండు వేల మిల్లులపై ఆరోపణలు చేయడంతో మిల్లర్లు బియ్యం ఆడించకుండా నిలుపుదల చేశారని వివరించారు. తద్వారా 1.5 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వానాకాలం సాగు పెట్టుబడుల కోసం రైతులు తమ ధాన్యం అమ్ముకునే అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరణను నిలిపేసిందని తెలిపారు. వర్షాలవల్ల కొన్నిచోట్ల మొలకలూ వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోవడానికి నిరాకరిస్తున్నదని పేర్కొన్నారు. ఏప్రిల్, మేలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేయలేదని తెలిపారు. గోదాముల్లో నిల్వలు పేరుకుపోయాయనే కారణంతో కేంద్రం బియ్యం సేకరణను నిలిపేస్తున్నదని వివరించారు. బఫర్ స్టాక్స్, ఎగుమతులకు బియ్యం కొనుగోలు అవసరముందని పేర్కొన్నారు. కావున మిల్లర్లు, రైతులు, కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు తక్షణమే బియ్యం కొనుగోళ్లను ఎఫ్‌సీఐ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అందుకనుగు ణంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.