Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్యశాఖలో ఒక కులం పెత్తనం
- సీఎంఓలోని ఆయన అండదండలతో జూనియర్లకు అందలం
- ఇక ఊరుకునేది లేదు...10 రోజుల్లో సీనియర్లకు పదోన్నతులు కల్పించాలి
- లేకపోతే పోరాటాలకు సిద్ధం
- ఎస్సీ, ఎస్టీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొన్న వివక్షను మించిన వివక్షను ఇప్పుడు భరిస్తున్నాం. నాడు సీమాంధ్రుల వల్లే సీనియర్లకు పదోన్నతులు రావడం లేదనీ, తెలంగాణ వస్తే సీనియర్లకు న్యాయం జరుగుతుందని భావించాం. అందుకే వైద్యగర్జన వంటి నిరసన కార్యక్రమాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాం. రాష్ట్రం వచ్చాక మేము అనుకున్నట్టుగా జరగలేదు. వైద్యారోగ్యశాఖలో సీనియర్లుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలను కాదనీ, జూనియర్లుగా ఉన్న ఎస్సీ, ఎస్టీయేతరులకు ఇన్ఛార్జీల పేరుతో ఏండ్ల తరబడి హెచ్ఓడీలుగా కొనసాగిస్తున్నారు. సీఎం కార్యాలయంలో ఉన్న ఒకాయన అండదండలతో డీఎంఈ డాక్టర్ కె.రమేశ్ రెడ్డి, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ఛాన్సలర్గా, టీఎస్ఎంఐడీసీ ఎండీగా మరో పెద్దమనిష్డి కొనసాగుతున్నారు...' అని ఎస్సీ, ఎస్టీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాబురావు విమర్శించారు. గురువారం హైదరాబాద్లోని ఐఎంఏ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాము కుల ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు హెచ్ఓడీలు అడుగుతున్నామనే తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఎవరు సీనియర్లుగా ఉన్నారో వారికే హెచ్ఓడీలుగా నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి 10 రోజుల సమయమిస్తున్నామనీ, ఈ లోపు పదోన్నతులను సీనియార్టీ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే ప్రగతిభవన్, రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాలను చేపడతామనీ, త్యాగాలకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖలో ఎస్సీ, ఎస్టీ డాక్టర్లకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీలో సీఎల్పీ లీడర్ భట్టివిక్రమార్క సర్కారు దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. జరిగిన తప్పులను సీఎం కేసీఆర్ సరిదిద్దాలంటూ ఆదేశించారని గుర్తుచేశారు. అయినప్పటికీ ఇంకా ఇన్ఛార్జీ వ్యవస్థ కొనసాగడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఆయుష్ ఆస్పత్రుల్లోనూ ఇలాంటి వివక్షే ఉందనీ, అందరితో కలిసి ఐక్యపోరాటానికి సిద్ధపడుతామన్నారు.
మెడికల్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ బొంగు రమేశ్ మాట్లాడుతూ, గతంలో రూ.20 కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని డీహెచ్గా కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంఈ రమేశ్ రెడ్డి మందుల కొనుగోళ్లలో కుంభకోణాలకు పాల్పడుతున్నారనీ, సీబీసీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈఎస్ఐలోనూ అదే పరిస్థితి....
ఈఎస్ఐ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నదని ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ పద్మజ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై వివక్ష ఉండేదంటూ పుస్తకాల్లో చదువుకున్నామనీ, అనుభవిస్తే కానీ దాని తీవ్రత ఏంటో అర్థం కాలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అమర్ సింగ్, డాక్టర్ అన్న ప్రసన్న, డాక్టర్ రవీందర్ నాయక్తో పాటు ఆయుష్ డాక్టర్లు పాల్గొన్నారు.