Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలు
నవతెలంగాణ- విలేకరులు
వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, వారసత్వ ఉద్యోగం కల్పించి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపి తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పట్టణంలో వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. నిర్మల్ జిల్లా ముధోల్, సారంగపూర్, బాసర మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బాసర తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి అధికారులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆదిలాబాద్‌లోని తాంసి, భీంపూర్‌లో వీఆర్ఏల సంఘం ఆధ్యర్యంలో తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జేఏసీ జిల్లా అధ్యక్షులు బి.రాములు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. బొంరాస్‌పేట మండలకేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రవికి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు బుస్స చంద్రయ్య, వీఆర్ఏలు పాల్గొన్నారు.