Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య ఉద్యమాలకు శ్రీకారం రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
భూ నిర్వాసితుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవటం లేదనీ, ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని పలువురు వక్తలు విమర్శించారు. గురువారం హైదరాబాద్లో '' భూ నిర్వాసితుల హక్కులు కాపాడాలి,వారిపై జరుగుతున్న దాడాలు ఆపాలి'' అనేక డిమాండ్లపై భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షులు ఆశప్ప అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో అసైన్డ్ భూములను లాక్కోవటం దారుణమని చెప్పారు.జహీరాబాద్ నిమ్జ్తో పాటు రాష్ట్రంలో 39చోట్ల నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 20చోట్ల ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై నిర్వాసితులను ముంచుతున్నారని విమర్శించారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై నిర్భందాన్ని ప్రయోగిస్తున్నారని తెలిపారు. నిర్వాసితుల ఉద్యమానికి నాయకత్వం వహించిన వారి పేర్లను...పరిహారం జాబితాలో లేకుండా చేస్తున్నారని చెప్పారు. చర్ల గూడెం గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరిగాయని చెప్పారు.నిర్వాసితుల సమస్యలపై ఐక్య ఉద్యమాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నిరంకుశ ప్రభుత్వం ఉందన్నారు. దానికి ప్రజాస్వామిక స్ఫూర్తి లేదని చెప్పారు. రైతులు భూములు ఇవ్వబోమని చెప్పినా..కేటీఆర్ పోలీసు బలగాలతో జహీరాబాద్ పోవటం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
భూ సేకరణ చేస్తే..2013 భూ సేకరణ చట్టం ప్రకారం చేయాలి కదా? అని ప్రశ్నించారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 12వందల మంది రైతులు చనిపోతే పటించుకోని సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు పరిహారం ఇవ్వటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఢిల్లీలో రైతులు ఏడాది కాలంగా ఉద్యమం చేస్తుంటే..కనీసం పరామర్శించలేదని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్, టీజేఎస్ నాయకులు వెంకటరెడ్డితో పాటు రైతు నిర్వాసిత ఉద్యమ నాయకులు ప్రసంగించారు. రాబోయే కాలంలో క్షేత్ర స్థాయి నుంచి హైదరాబాద్ వరకు దశలవారీ ఉద్యమం నిర్వహించాలనే కార్యక్రమాన్ని ప్రకటించారు.