Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరస్కరించిన బ్యాంకర్లు
- ఆందోళనలో లబ్దిదారులు
- ఎమ్మార్వో కార్యాలయంలో మొర..
- వారం రోజుల్లో ఇస్తామంటున్న అధికారులు
నవతెలంగాణ- నల్లగొండ/ మునుగోడు
షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాల ద్వారా ఆడపడుచులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే, ఆ చెక్కులను బ్యాంకర్లు తిరస్కరించారు. రెండు నెలల కిందట చెక్కులు మంజూరైనా ఇవ్వడంలో ఆలస్యం చేయడం వల్లే ఇలా అయిందని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలంలో 76 మంది ఆడపడుచుల వివాహాల అనంతరం బుధవారం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కొద్దిమందికి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయా మండలాల్లో తహసీల్దార్లు లబ్దిదారులకు సోమవారం పంపిణీ చేశారు. అయితే మంత్రి, అధికారులు పంపిణీ చేసిన చెక్కులను తీసుకొని లబ్దిదారులు గురువారం బ్యాంకుకు వెళితే.. చెక్కులు చెల్లవని బ్యాంకు అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని పలువురు లబ్దిదారులు తహసీల్దార్ కార్యాలయంలో చెప్పుకొనేందుకు వెళ్లగా అక్కడి ఉద్యోగి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టు బాధితులు తెలిపారు.
మునుగోడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులు 76 మందికి బుధవారం సాయంత్రం మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. అందులో 50 చెక్కులు మార్చి నెల 30, 31న మంజూరు చేసినట్టు ముద్రించి ఉన్నాయి. కాగా లబ్దిదారులు తమ ఖాతాల్లో జమ చేయడానికి బ్యాంకుకు వెళ్తే.. గడువు తీరిపోయిందని చెప్పడంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. చెల్లని చెక్కులను ఏం చేసుకోవాలని తహసీల్దార్‌ను నిలదీశారు. దీంతో అధికారులు ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో చెక్కులను జిల్లా కార్యాలయంలో ఇచ్చి వెళ్లారు. గురువారం తహసీల్దార్ కార్యాలయానికి 35మంది చెక్కులను తిరిగి ఇచ్చారు.
గడువు తీరిపోయింది
- చెడురుపల్లి అండాలు- మునుగోడు మండలం
గతేడాది నవంబర్ నెలలో తన కూతురు కీర్తన వివాహం చేశారు. నెల రోజుల్లోపు కల్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకున్నాం. బుధవారం సాయంత్రం మంత్రి చేతుల మీదగా చెక్కు అందుకున్నా. దాన్ని తీసుకుని గురువారం బ్యాంకు వెళ్తే.. గడువు తీరిపోయింది అని బ్యాంకు అధికారులు చెప్పారు. మళ్లీ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను సంప్రదించగా.. ఆ చెక్కు తీసుకుని.. వారం రోజుల్లో మళ్లీ ఇస్తామని చెప్పారు.
రెండేండ్ల కిందట దరఖాస్తు చేసుకున్న..
- మెండే అచ్చమ్మ - మర్రిగూడ మండలం, సరంపేట
మర్రిగూడ మండలం సరంపేట గ్రామానికి చెందిన మండే అచ్చమ్మ కుమార్తె వివాహం 2020లో జరిగింది. అదే సంవత్సరం కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కుమార్తెకు ఇప్పుడు ఇద్దరు సంతానం. రెండు సంవత్సరాల తర్వాత మంజూరైన చెక్కు.. చెల్లకుండా పోయిందని ఆమె తహసీల్దార్ కార్యాలయం ముందు ఆవేదన వ్యక్తం చేసింది. పెండ్లి ఖర్చులకు ఆసరా అవుతుందనుకుంటే.. మనుమడు, మనుమరాలు పుట్టిన తర్వాత కూడా చేతికి అందకపాయే అని అసహనం వ్యక్తం చేశారు.
చెక్కు వచ్చినా ఇవ్వలేదు
- దామెర బుజ్జమ్మ- మర్రిగూడ మండలం, సరంపేట
తమ పేరు మీద ఎమ్మార్వో కార్యాలయానికి కల్యాణ లక్ష్మి చెక్కు వచ్చి రెండు నెలలు కావస్తున్నా.. ఇవ్వలేదు. తీరా గడువు తీరిన తర్వాత ఇచ్చారు. బ్యాంకు అధికారులు ఆ చెక్కును తీసుకోలేదు. చెక్కుల పంపిణీలో జాప్యం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకోవాలి.
దిద్దుబాటు చర్యల్లో అధికారులు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు తహసీల్దార్ కార్యాలయానికి వాపస్ రావడంతో అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆర్డీఓతో ఫోన్లో సంప్రదించి చక్కదిద్దే పనిలో యంత్రాంగం నిమగమైంది.