Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి, కిషన్‌రెడ్డి గన్‌పార్కువద్ద ముక్కు నేలకు రాయాలి
- తెలంగాణను అవమానించారు... ఏపీ ప్రత్యేకహోదా మరిచారు...
- విభజన హామీలపై జవాబు చెప్పాలి
- బలమున్నచోట కాకుండా బలహీనమైన చోట మీటింగ్ ఎందుకు?: ప్రధాని మోడీపై రేవంత్ విమర్శలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రజలను పార్లమెంటు సాక్షిగా అవమానించిన ప్రధాని నరేంద్రమోడీ ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పి... ఈ గడ్డపై అడుగుపెట్టాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్, కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి అమరవీరుల స్థూపం (గన్‌పార్కు) వద్ద ముక్కు నేలకు రాసి, ప్రజలను క్షమాపణ కోరాలని సూచించారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తెలంగాణను అవమానించారు...ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా మరిచారు. మోసం చేశారు.' ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని నిలదీశారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ నేతలతో కలిసి రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. పార్టీకి బలమున్న చోట జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తారనీ, బలహీనంగా ఉన్న చోట ఎందుకు సమావేశాలు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. గతంలో కాకినాడ సమావేశాల్లో 'ఒక ఓటు రెండు రాష్ట్రాలు' అని బీజేపీ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. దీంతో ఆ పార్టీకి ప్రజలు ఏడు ఎంపీ స్థానాలు కట్టబెట్టారని తెలిపారు. బీజేపీ ఉత్తరాదిన మూడు రాష్ట్రాల ఏర్పాటు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా ప్రజల ఆశలను దగా చేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలను బీజేపీ మోసం చేస్తే, ఏపీ కాంగ్రెస్ చచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పారు. పార్లమెంట్లో ఉన్న ఇబ్బందులు దృష్యా తలుపులు మూసి లైవ్ కట్ చేసి తెలంగాణ ఇచ్చిందనీ, ఆ ఘటన చరిత్రాత్మకమైందన్నారు. మోడీ పార్లమెంట్లో మాట్లాడుతూ తల్లిని చంపి పిల్లను ఇచ్చారంటూ దుర్మార్గంగా మాట్లాడారని విమర్శించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఎన్టీపీవీ థర్మల్ ప్రాజెక్టు, ఐటీఐఆర్, సాగు నీటి ప్రాజెక్టుకు జాతీయహోదాకు చట్టం బద్దత ఉన్నప్పటికీ ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో మన రాష్ట్రానికి చిల్లిగవ్వ ఇవ్వలేదని విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతియేటా రెండు కోట్ల ఉద్యోగాలు, పేదల అకౌంట్లో 15 లక్షలు జమ అంటూ హామీ ఇచ్చిన మోడీ...అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపారని మండిపడ్డారు. నిధుల కేటాయింపు, మంత్రి పదవుల్లో దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. వెంకయ్యనాయుడుకు కేంద్రమంత్రి పదవి ఊడగొట్టి ఉపరాష్ట్రపతి ఇచ్చి ఇప్పుడు ఉద్యోగం ఉడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ విధంగా మోడీ తెలుగువారిని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న కేంద్రమంత్రి వల్ల పైసా ఉపయోగం లేదనీ, ఏపీకి అసలు మంత్రే లేడని చెప్పారు. ముంబై ఎయిర్‌పోర్టు తెలుగు వారు నిర్మించారనీ, ఈడీ కేసు పెడతామంటూ బెదిరించి దాన్ని వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. కష్ణపట్నం పోర్టును తీసుకుని తెలుగు ప్రజలను ఘోరాతిఘోరంగా బీజేపీ అమానిస్తున్నదని మండిపడ్డారు. ఎనిమిదేండ్లుగా మోడీకి కాపల కుక్కగా ఉన్న టీఆర్ఎస్కు ఇప్పుడు ఫ్లెక్సీల చిల్లర పంచాయతీ ఎందుకని ప్రశ్నించారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని రక్షిస్తుందా?కడుపు నింపుతుందా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చిల్లర పంచాయతీ లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఫ్లెక్సీల కోసం కొట్టుకోవడమా? విభజన చట్టంలోని అంశాలపై చర్చ పెట్టడమా? ఏది ముఖ్యమని ప్రశ్నించారు. చిల్లర విషయాలు మానుకోవాలంటూ సీఎం కేసీఆర్‌కు సూచించారు. అగ్నిపథ్‌పై టీఆర్ఎస్ వైఖరేంటనీ, అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు దగ్గర రెండు రోజుల నిరసన కార్యక్రమాల కోసం కమిషనర్ అనుమతి తిరస్కరించారనీ, యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్‌కు వస్తున్నట్టు తెలిసిందన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి సీఎం కేసీఆర్‌ను కలిశాక...కాంగ్రెస్ ఎమ్మెల్మేలు ఆయన్ను కలిసేందుకు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. 'ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలొద్దు' అని స్పష్టం చేశారు. ఆయన టీఎంసీ అభ్యర్థి తమ పార్టీ అభ్యర్థి కాదని తెలిపారు. ఈ అంశంలో మమత బెనర్జీ కాంగ్రెస్‌ను మద్దతు అడిగారని గుర్తు చేశారు. మాజీ కొండా విశ్వేశ్వర రెడ్డి తమ మిత్రుడు, పార్టీ మరేటప్పుడు చెబుతాడని అనుకున్నా...ఆ పార్టీలో చేరిన కొద్దీ కాలం తర్వాత ఆయనే వెను దిరిగి చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.