Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిహారం అడిగితే నిర్బంధం
- భూ నిర్వాసితుల గోడు పట్టని సర్కార్
- పేదల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం
- పరిహారం కాదు..బహిరంగ మార్కెట్ విలువను రైతులకివ్వాలంటూ డిమాండ్
- మాట తప్పిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''ప్రాజెక్టులు కడతామన్నారు. పరిశ్రమలు పెడతామన్నారు. వద్దని మొత్తుకున్నాం. వినలేదు. నమ్ముకున్న వ్యవసాయ భూములను లాక్కున్నారు. బతుకుదెరువు చూపిస్తామని బోల్తా కొట్టించారు. తీరా తమ పని పూర్తయ్యాక ముఖం చాటేశారు. నెత్తి నోరు కొట్టుకున్నా అటు వైపు చూడటం లేదు.''అని భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి కాదు..రెండు కాదు.. రాష్ట్రంలో వేల ఎకరాల భూముల్ని కోల్పోయిన రైతులు నిర్వాసితులుగా మారారు. వారి గోస ఈ ప్రభుత్వానికి పట్టకపోవటం శోచనీయం. పైగా పేదల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. మాకు కావాల్సింది పరిహారం కాదు.. బహిరంగ మార్కెట్లో ఉన్న విలువ ప్రకారం ధర నిర్ణయించాలని వారు ఆందోళన చేస్తున్నారు. మాట తప్పిన సర్కారుపై విమర్శలు సంధిస్తున్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని మరింత పకడ్భందింగా అమలు చేయాల్సిన ప్రభుత్వం ఈ చట్టాన్ని అటకెక్కించటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
రైతులకు బేడీలెందుకు?
బంగారు తెలంగాణంలో రైతులకు బేడీలు సర్వసాధారణమైంది. మొన్న ఖమ్మం, నేడు గౌరెల్లి నిర్వాసిత రైతులకు బేడీలు పడ్డాయి. రేపు మరే రైతుకో? ఇదేనా స్వరాష్ట్రంలో రైతులకిచ్చే మర్యాద? అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి నిర్వాసిత గ్రామమైన గుడాటిపల్లెలో 500 మందికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.8 లక్షల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రావాల్సి ఉంది. సర్వే చేయని 110 మంది నిర్వాసితులకు ఇళ్ల అడుగు స్థలాల పరిహారాన్ని కూడా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. రీ డిజైనింగ్‌లో ఇళ్లు, భూములు కోల్పోయిన 187 కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. తమకు పూర్తిస్థాయిలో పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. గతేడాది డిసెంబర్ నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. మొన్న ట్రయల్ రన్ నిర్వ హించనున్న నేపథ్యంలో.. నిర్వాసితులు ఆందోళనకు దిగా రు. అంతే..వందల మంది పోలీసు బలగాలను ప్రభు త్వం దించింది. ఇదేంటని అడిగిన రైతులపై దాడులు చేసిం ది. మహిళల్ని సైతం వదలకుండా గాయపర్చింది. బద్ధం శంకర్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, భూక్యా సక్రులను అరె స్టు చేసింది.. వారిపై నాన్‌బెయిల్ బుల్ కేసులు బనాయిం చింది. గురువారం బేడీలతో కోర్టుకు తీసుకొచ్చింది.
కోటి ఎకరాల మాగాణ సరే.. పరిహారమో?
మాట మాట్లాడితే కోటి ఎకరాల మాగాణి నా కల.. బంగారు తెలంగాణ నిర్మాణం నా చిరకాల వాంఛ అంటూ సీఎం కేసీఆర్ పదేపదే చెబుతుంటారు. కానీ ఈ కోటి ఎకరాల మాగాణి నీరిచ్చే ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులను మాత్రం పట్టించుకోడు. సొంత జిల్లాలో మల్లన్నసాగర్ బాధితులైనా, ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ నిర్వాసితులైనా, గౌరవెల్లిలో మునిగే బీద రైతు లైనా, డిండిలో సర్వం కోల్పోయే నల్లగొండ రైతులయినా ప్రభుత్వానికి పట్టదు. మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలంటే సర్కారుకు నచ్చదు. సభలు సమావేశాల్లో మాత్రం తెలంగాణలో ఎకరా భూమి రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షలు పలుకుతోంది అని గొప్పగా చెబుతుంటారు.
గౌరవెల్లి ఇప్పటిది కాదు
హుస్నాబాద్ పరిధిలో నిర్మించే గౌరవెల్లి ప్రాజెక్ట్ గొడవ ఇప్పటిది కాదు. ఇప్పటితో ముగిసేది కాదు. మెరుగైన పరిహారం కోసం అక్కడి రైతులు చేయని నిరసన అంటూ లేదు. ప్రభుత్వానికి, ఎదురైన అధికారికి, కనిపించిన ప్రజాప్రతినిధికి మొరపెట్టుకున్న వారి గోడు వినే వారు కరువయ్యారు. అసలే రైతులు, ఆ పైన ఉన్నది కొద్దిపాటి భూమి.. అండగా ఉండాల్సిన ప్రభుత్వం పోలీసుల్ని ఎగదోసి చెదరగొట్టింది. లాఠీలకు ఝళిపించింది. రైతుల తలలు పగిలాయి. మహిళల చేతులు విరిగాయి. అయినా కనీసం ప్రభుత్వం నుంచి ఒక పరామర్శ కూడా రైతులకు రాలేదు.ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నందుకు మాకు జరిగే న్యాయం ఇదా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డిండిది మరో ఘోరం
ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు రక్షి త మంచి నీటిని అందించే ఉద్దేశంతో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి మార్గదర్శనం కరువైంది. ఈ ప్రాజెక్టుకు నీటిని తీసుకునే అలైన్‌మెంట్‌ను ఐదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఖరారు చేసినా, దీనికి ఇంతవరకూ ప్రభుత్వ ఆమోదం దక్కలేదు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ నుంచి కాకుండా ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేందుకు ఇప్పటికే నీటి పారుదల శాఖ చెప్పినా, ప్రభుత్వం ఇంకా నాన్చుతుండటంతో ఎటూ తేలడంలేదు. ఇక ఇప్పటికే మొదలైన రిజర్వాయర్ల పరిధిలోనూ భూసేకరణ, సహాయ పునరావాస పనుల్లో అనేక అవాంతరాలున్నాయని రైతులు చెబుతున్నారు.
రాష్ట్రంలో విరివిగా భూ సేకరణ
రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 3,99,537 ఎకరాలు సేకరించినట్టు సమాచారం. ఇవి కాకుండా..ఇంకా వివిధ పేర్లతో లక్షన్నర ఎకరాలకు పైగా భూములు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్దపడుతున్నదని తెలుస్తున్నది. అంటే ఈ మేరకు నిర్వాసితుల సంఖ్యను మరింత పెరగనున్నదని తెలుస్తున్నది. ముచ్చర్ల ఫార్మాసిటీకి ఇప్పటికే 15వేల ఎకరాల భూములు సేకరించారు. ఇన్ని వేల ఎకరాల భూములు సేకరించాల్సిన అవసరమేమొచ్చిందన్న చర్చ జరుగుతున్నది. యాదాద్రి అభివృద్ధి పేరుతో వేల ఎకరాలు సేకరించగా, మహాబూబ్‌నగర్ జిల్లా ఉద్దండాపూర్, మెదక్ జిల్లా నిమ్జ్, కరీంనగర్ జిల్లా మిడ్‌మానేరు ఇలా సుమారు రాష్ట్రంలోని 30 ప్రాంతాలలో వేలాది మంది సన్న చిన్నకారు రైతులు నిర్వాసితులుగా మిగిలారు. వీరిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందని వారు రోదిస్తున్నారు.
మిడ్ మానేరు నిర్వాసితులు అప్పుల పాలు..
కూస రవీందర్
ముంపు గ్రామాల ఐక్య వేదిక నాయకులు
''మిడ్ మానేరు నిర్వాసితులు భూములు కోల్పోయి అప్పుల పాలవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కసీఆర్ 2008 జూన్ 25న నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ మాతో కలిసి దీక్షలో కూర్చున్నారు. ఆంధ్ర పాలకుల వల్ల మిడ్‌మానేరు నిర్వాసితులకు అన్యాయం జరిగిందని ఉందాం..తిందాం..పందాం..అనే నినాదంతో మాలో ఉద్యమాన్ని తట్టిలేపారు. నేడు అధికారంలోకి రాగానే మాటమార్చారు'.
గౌరెల్లి నిర్వాసిత రైతులు ఉగ్రవాదులా? రాజిరెడ్డి
భూ నిర్వాసితుల ఐక్య వేదిక నాయకులు
'గౌరెల్లి నిర్వాసిత రైతులు ఎన్నో సార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తమకు నష్టపరిహారం ఇవ్వాలని మొరపెట్టుకున్నారు. అయినా ప్రభుత్వం మా గోడు పట్టించుకోలేదు. పైగా మాపై పోలీసులతో దౌర్జన్యానికి పాల్పడింది. మా భూములు గుంజుకుని మా పైన్నే కేసులు పెట్టి..నేడు రైతులకు ఉగ్రవాదుల్లా బేడీలు వేసింది. సుమారు 1,500కుటుంబాలను నిర్వాసితులను చేసిన ఉసురు ఈ ప్రభుత్వానికి తగుల్తది'.
2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి
'రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో విచ్చల విడిగా భూములను సేకరిస్తున్నది. భూములు కోల్పోతున్న రైతులు, వాటిపై ఆధారపడే వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, ఇతర తరగతులకు కొంతమేరకైనా ఉపయోగపడే 2013 భూసేకరణ చట్టాన్ని అటకెక్కించి 123వ జీవో ద్వారా భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడింది. దీంతో రాష్ట్రంలోని లక్షలాధి మంది భూ నిర్వాసితులు రోడ్డున పడ్డారు. వీరికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ అబద్దాల ప్రచారం చేస్తున్నది'.
- రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిటి. సాగర్