Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలి : పట్టణాభివృద్ధి వేదిక రాష్ట్ర కార్యదర్శి డిజి.నర్సింహారావు
- ఎస్వీకేలో రౌండ్‌టేబుల్ సమావేశం
నవతెలంగాణ-ముషీరాబాద్
ప్రయివేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ పట్టణాభివృద్ధి వేదిక రాష్ట్ర కార్యదర్శి డిజి.నర్సింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, టీయూడీఎఫ్, టీపీఏ, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ''ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని'' రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిజి.నర్సింహారావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు తగినంత బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు పాఠశాలలు 25 శాతం సీట్లను పేద బలహీన వర్గాల వారికి ఉచితంగా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రయివేటు పాఠశాలల్లో వసూలు చేసే ఫీజులను నోటీసు బోర్డుపై ఉంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలులేక పేద మధ్యతరగతి ప్రజలు కూడా ప్రయివేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రయివేటు యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలాంటి ప్రాంతాల్లో విద్యను లాభసాటి వ్యాపారంగా భావించి ప్రయివేటు పాఠశాల యాజమాన్యాలు దండుకుంటున్నాయని చెప్పారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ.. ప్రయివేటు పాఠశాలలను నియంత్రించాలని 2012లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా అమలు కావడం లేదన్నారు. హైదరాబాద్ నగరంలో ఐదు కిలోమీటర్లకు 8కి పైగా ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయని వివరించారు.
ప్రభుత్వం 2017లో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన తిరుపతిరావు కమిటీ.. ఫీజుల్ని నియంత్రించకపోగా ప్రతి ఏటా 10 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచుకోవచ్చని అనుమతి ఇవ్వడం ఆశ్చర్యకరం అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ బడుల దుస్థితి మరింత దిగజారుతుందని, మన ఊరు- మనబడి పేరుతో స్కూళ్లను మెరుగు పరుస్తామని చెప్పిన ప్రభుత్వం.. బడ్జెట్ కూడా కేటాయించడం లేదని విమర్శించారు.
డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యుత్తు, మరుగుదొడ్లు, తాగునీరు తదితర సౌకర్యాలు లేవని, పారిశుధ్య కార్మికులను తొలగించడంతో మరుగుదొడ్లు వాడుకునే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. మధ్యాహ్న భోజనం వండే షెడ్లు కూడా చాలాచోట్ల లేక అవస్థలు పడుతున్నారన్నారు. విద్యా వాలంటీర్లను భర్తీ చేయకపోవడంతో టీచర్ల కొరత ఏర్పడి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఐద్వా హైదరాబాద్ నగర కార్యదర్శి కె.నాగలక్ష్మి, డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి ఎండి.జావేద్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అశోక్‌రెడ్డి, పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక నగర కార్యదర్శి నగర కార్యదర్శి అజరు బాబు తదితరులు పాల్గొన్నారు.