Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవసరం లేని మందులు, పరికరాల కొనుగోలు
- ఇన్ఛార్జీ డైరెక్టర్‌తో ఇబ్బందులు
- పర్యవేక్షణ లోపంతో సమస్యలు
- ఐఎంఎస్‌లో విచిత్ర పరిస్థితులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కార్మికుల శ్రేయస్సు కోసం పని చేయాల్సిన ఆ విభాగంలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ఇన్ఛార్జీ డైరెక్టర్‌కు పలు బాధ్యతలు ఉండటంతో పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్న వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. గతంలో ఔషధాల కొనుగోలుకు సంబంధించి అవినీతి జరిగిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) తర్వాత కాలంలో గాడిలో పడుతుందని అంతా భావించారు. ఈ అంశాన్ని అవినీతి నిరోధక బ్యూరోకు అప్పగించిన తర్వాత కూడా అవే పరిస్థితులు కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. ఈఎస్ఐ మందుల స్కాం సమయంలో ఈసీజీ స్కాంకు సంబంధించి రూ.50 కోట్ల నిధులను విడుదల కాకుండా పెండింగ్‌లో పెట్టారు. అయితే ఇటీవల ఆ స్కాంకు సంబంధించి అంతర్గతంగా మొక్కుబడి విచారణ జరిపి అలాంటిదేమి లేదనే విధంగా రిపోర్టును విడుదల చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
ఐఎంఎస్‌కు ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా ఉన్న అహ్మద్ నదీం లేబర్ కమిషనర్‌తో పాటు పలు అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీంతో దాని కార్యకలాపాలకు సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకున్న ఆ తర్వాతి స్థానాల్లోని వారు ఆర్థికపరమైన అవకతవకలతో పాటు ఉద్యోగులను వేధించటం, నిబంధనలను ఉల్లంఘిస్తూ తమకు అనుకూలంగా ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇచ్చుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి వద్ద గతంలో ఎప్పుడు లేని విధంగా పర్సనల్ అసిస్టెంట్‌గా ఉన్న వ్యక్తి ఈసీజీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం కూడా ఇందులో భాగమేనని తెలుస్తున్నది. రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో గతంలో ప్రతి రోజు 700 మంది వరకు ఈసీజీ చేసినట్టు ఒక్కో రోగికి రూ.750 బిల్లు వేసినట్టు ప్రచారం జరిగింది. ఆ సమయంలో బయట మార్కెట్లో ఈసీజీ ధర రూ.200 నుంచి రూ.250 మాత్రమే. ఈ నేపథ్యంలో దాని బిల్లులను ఆపేశారు. అయితే ఇటీవల దీనిపై అంతర్గతంగా తూ ...తూ మంత్రంగా విచారణ జరిపి ఆ పరీక్షల కాంట్రాక్టు పొందిన సంస్థకు నిధులు విడుదల చేసినట్టు సమాచారం. కూడా పూర్తి స్థాయి డైరెక్టర్ లేకపోవడమే కారణమనే వాదన వినపడుతున్నది.
మందుల గోల్ మాల్....
మందుల కొనుగోలు క్షేత్రస్థాయిలో అవసరాల మేరకు జరగాలి. ఈ అవగాహన క్రింద స్థాయిలో పని చేసే డాక్టర్లకు ఉంటుంది. వారు కోరిన మందులను కొనుగోలు చేసి సరఫరా చేస్తే రోగులకు అవసరమైన మందులు లభిస్తాయి. అయితే ఐఎంఎస్‌లో మందుల కొనుగోలుకు పాటిస్తున్న ప్రాతిపదికలు భిన్నంగా ఉంటున్నాయని సమాచారం. మల్టీ విటమిన్స్ టాబ్లెట్స్ అవసరానికి మంచి కొనుగోలు చేసి కుప్పలు కుప్పలుగా పంపిస్తున్నారనీ, అదే సమయంలో యాంటీ బయాటిక్స్‌కు కొరత ఉందని చెబుతున్నారు. క్యాన్సర్ మందులుకు సంబంధించి రూ.25 వేలకు దొరికే ఔషధాలను రూ.ఒక లక్ష పెట్టి కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి.
కిందిస్థాయి సిబ్బందిపై వేధింపులు...
అవసరం లేని పరికరాల కొనుగోలు
ఈఎస్ఐ వ్యవస్థలో డిస్పెన్సరీలు ప్రాథమిక స్థాయి వైద్యం అందించేందుకు పరిమితమవుతాయి. అలాంటి డిస్పెన్సరీల అవసరాలను గుర్తించకుండా తమకు కమిషన్లు, తమ అనుయాయులకు లాభాలు తెచ్చే వాటిపైనే ఉన్నతాధికారులు దృష్టి పెట్టారనే ఆరోపణలున్నాయి. ఐసీయూలో అందుబాటులో ఉంచాల్సిన పరికరాల కోసం ఇండెంట్ పెట్టాలంటూ డిస్పెన్సరీల డాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. పల్స్ ఆక్సీమీటర్లు తదితర వాటి కోసం ఇండెంట్ పెట్టాలని ఒత్తిడి పెంచుతుండటంతో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించి, జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపితేనే సిబ్బందికి, రోగులకు న్యాయం జరిగే అవకాశమున్నది.
ఖాళీలను గుర్తించడంలో ఆలస్యం...
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఈ విభాగంలో 137 డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని అధికారులు సకాలంలో గుర్తించి ప్రతిపాదనలు పంపలేదని తెలుస్తున్నది. దీంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో డాక్టర్ల పోస్టుల భర్తీకి ఇప్పటికే మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డుకు అప్పగించినప్పటికీ ఈ శాఖ పరిధిలో వచ్చే డాక్టర్ల పోస్టులు మాత్రం మంజూరు దశలోనే ఆర్థికశాఖ వద్ద ఆగినట్టు సమాచారం.
డైరెక్టర్‌గా సీనియర్ డాక్టర్‌ను నియమించాలి
ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) రెగ్యులర్ డైరెక్టర్‌గా సీనియర్ వైద్యుణ్ని నియమించాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఈఎస్ఐ విభాగం) అధ్యక్షులు డాక్టర్ సీహెచ్.శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. ప్రస్తుత ఇన్ చార్జీ డైరెక్టర్ కార్మిక, మైనార్టీ శాఖలతో పాటు పలు ఇతర బాధ్యతల్లో ఉన్నందున సమస్యలపై దృష్టి పెట్టలేకపోతున్నారని తెలిపారు. ఈ విషయమై తమ అసోసియేషన్ తరపున రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి, సీఎస్ సోమేశ్ కుమార్‌కు, రాష్ట్ర కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి జూన్ 7న వినతిపత్రాలు సమర్పించామని తెలిపారు.