Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనదే పై చేయి కావాలే...
- బీజేపీ కార్యక్రమాలకు ధీటుగా టీఆర్ఎస్ కార్యాచరణ
- హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఫ్లెక్సీలు, బ్యానర్లు
- మోడీ పరిపాలనపై వ్యంగ్యాస్రాలు
- పక్కా ప్లాన్, స్కెచ్‌తో ముందుకు
- నేడు యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం
- జలవిహార్‌లో భారీ బహిరంగ సభ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని మోడీ పర్యటనను, ఆయన పాలనలోని లోపాలను సమర్థవంతంగా ఢ కొట్టేందుకు అధికార టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేసింది. శనివారం నుంచి సోమవారం ఉదయం వరకూ మొత్తం మూడు రోజులపాటు ఆయన హైదరాబాద్‌లోనే బస చేయనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలకటం ద్వారా, ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తద్వారా మోడీ రాకకు ధీటుగా సిన్హా హైదరాబాద్ పర్యటనను మలచాలని ఆయన నేతలకు సూచించారు. శనివారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్...బేగంపేట ఎయిర్‌పోర్టులో యశ్వంత్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయనకు మద్దతుగా పది వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో నిర్వహించబోయే సభలో సైతం కమలం పార్టీని ఏకిపారేయాలని కేసీఆర్ నిర్ణయించారు. తద్వారా బీజేపీపై పై చేయి సాధించేందుకు ఆయన ఇప్పటికే వ్యూహ, ప్రతివ్యూహాలు రచించినట్టు తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి. మరోవైపు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, దాని మతోన్మాద చర్యలపై టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తోపాటు పలువురు సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కమలం పార్టీపై ఎదురు దాడి చేస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు, ఇక్కడకు రావాల్సిన నిధులపై వారు బీజేపీకి, ప్రధాని మోడీకి పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డిని సైతం వారు పత్రికాముఖంగా నిలదీస్తున్నారు. ముఖ్యంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, నిజామాబాద్ పసుపు బోర్డు, వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీ, రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు, కాళేశ్వరానికి జాతీయ హోదా, ఏపీలో కలిపిన ఏడు మండలాలు తదితరాంశాలపై గులాబీ పార్టీ ఈ రకమైన ఎదురు దాడి కొనసాగిస్తున్నది. దీంతోపాటు హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు బీజేపీ విధానాలను తూర్పారబడుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశమవుతున్నాయి. పలు సెటైర్లు, వ్యంగ్యాస్త్రాలతో కూడిన ఆ బ్యానర్లు, కటౌట్లు ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ వైరలవటం గమనార్హం. యశ్వంత్ సిన్హా రాకను పురస్కరించుకుని మెట్రో పిల్లర్లు, జంక్షన్లు, కూడళ్లలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బ్యానర్లు, కటౌట్లు బీజేపీతో పోలిస్తే ఒక మెట్టు ఎక్కువగానే ఉన్నాయన్నది విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఇటు ప్రదర్శనలు, ర్యాలీలతోపాటు అటు కమలం పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టటంలోనూ ధీటుగా ముందుకెళ్లనుందని ఓ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో రాజకీయాలు మరింత రసకందాయంలో పడనున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.