Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎంసీ భేటిలో రాష్ట్రం డిమాండ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
వరదజలాలనూ తెలంగాణ వాటాలో భాగంగానే లెక్కించాలనీ కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఏర్పాటుచేసిన రివర్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. కృష్ణానదీలో ప్రతి నీటి చుక్క లేక్కతేల్చాలని కోరింది. మిగులు జలాలను తామూ కూడా వాడుకుంటామని స్పష్టం చేసింది. అయా నెలల్లో విడుదల చేయాల్సిన , కొనసాగించాల్సిన నీటి మట్టం(రూల్ కర్వ్) అంశాలని ఆర్ఎంసీ తేల్చలేని పక్షంలో, దానిని కేఆర్ఎంబీకి అప్పగించాలని సూచించింది. శుక్రవారం హైదరాబాద్ లోని జలసౌధలో కృష్ణానదీ మేనేజ్మెంట్ కమిటీకి భేటి అయింది. దీనికి కేఆర్ఎంబీ సభ్యులు రవికుమార్ పిళ్లై అధ్యక్షత వహించారు. కాగా వరద జలాలను కూడా నీటి వాటాల్లో భాగంగా లెక్కించాలన్న తెలంగాణ డిమాండ్‌పై ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిపింది. వరద జలాలను ఆయా రాష్ట్రాల కోటాగా పరిగణించాలని ఆర్ఎంసీని కోరింది. వరదల సమయంలో సముద్రంలో కలుస్తున్న నీటిని మాత్రమే తాము వాడుకుంటున్నామని ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి తెలిపారు. మిగులు జలాలను తెలంగాణ కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. సముద్రంలోకి వెళ్లే నీటిని మళ్లిస్తే రాష్ట్రాల కోటాగా పరిగణించాలనడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎంత నీరు మళ్లీస్తున్నారన్నదీ తేల్చేందుకు ఏపీకి అభ్యంతరం లేదన్నారు. కాగా, మరో రెండు ఆర్ఎంసీ సమావేశాలు నిర్వహించాలనీ ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఆ సమావేశాల తర్వాత జలాల వినియోగం, పంపిణీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో కేఆర్ఎంబీ సభ్యులు మౌంతాంగ్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, తెలంగా ణ, ఏపీ జెన్కో అధికారులు పాల్గొన్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి కోసం మార్గదర్శకాలు, వరదల సమయంలో వినియోగించుకునే జలాల విషయమై చర్చించారు.