Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళలకు రక్షణ, భద్రత కల్పించటం అవసరమనీ, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగిన కృషి చేస్తున్నదని స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి సదస్సు నిర్వహించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కేరళ, ఒరిస్సా రాష్ట్రాల శిశు, సంక్షేమ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలికలతో కొందరు వ్యక్తులు ప్రేమ పేరుతో పాటు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని నమ్మబలకుతున్నారని చెప్పారు. పేదరికం, కుటుంబ అవసరాలను తీరుస్తామని ఆకర్షిస్తున్నారన్నారు. నిరుద్యోగం, భర్త నుంచి విడిపోయిన మహిళలను లొంగ తీసుకోవడం చేస్తున్నారనీ, ఒంటమహిళలను టార్గెెట్ చేసుకుని మోసం చేస్తున్నారని తెలిపారు. సినిమాల్లో అవకాశాలిప్పిస్తామనీ ఆశ చూపి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు తెలుస్తున్నదని చెప్పారు. ప్రపంచంలో మాదక ద్రవ్యాలు, ఆయుధాల సరఫరా తరువాత మానవ అక్రమ రవాణా ఉండటం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. స్వలాభం కోసం కొందరు మనుషులను కొనడం, అమ్మడం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ రవాణాకు గురైన వారిని ఎక్కువగా సెక్స్ వర్కర్లుగా, అడాప్షన్ రాకెట్లలో,కూలీలుగా, బాలకార్మికులుగా, బిచ్చగాళ్ళు గా మారుస్తున్నారన్నారు. ప్రభుత్వ సంస్థలతో పాటు పౌర సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి అక్రమరవాణా నిర్మూలనకు కృషి చేయాలని చెప్పారు.
అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు 100 డయల్ చేయాలనీ, మహిళా హెల్ప్‌లైన్ 181ని సంప్రదించాలని సూచించారు. మహిళా కమిషన్ వాట్సప్ నంబర్లకు, చైల్డ్ లైన్‌కు ఫోన్‌చేసి తెలపాలని సూచించారు. కార్యక్రమంలో జస్టిస్ నవీన్ రావు, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్, కమిషనర్ మహేష్ భగవత్, ఇతర రాష్ట్రాల మహిళ శిశు సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.