Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్దేశ్యపూర్వకంగానే యాజమాన్యం కాలయాపన-కార్మిక సంఘాలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
బొగ్గుగని కార్మికుల వేతన సవరణకోసం కార్మిక సంఘాలతో భేటీ అయిన యాజమాన్య కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. కమిటీ ప్రతిపాదనలపై కార్మిక సంఘాల నాయకులు ప్రారంభంలోనే అభ్యంతరం తెలిపారు. ఫలితంగా ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. సమావేశం నుంచి అర్థంతరంగా బయటకు వచ్చేసిన కార్మిక సంఘాల నాయకులంతా ఉమ్మడిగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఓ హౌటల్లో జాయింట్ బైపార్టీ కమిటీ ఫర్ ది కోల్ ఇండిస్టీ (జేబీసీసీఐ) సమావేశం జరిగింది. దీనిలో యజమాన్యం మూడు శాతం నుండి చర్చలు ప్రారంభించడాన్ని కార్మిక సంఘాలు ఆక్షేపించాయి. గతంలో ఇచ్చిన 27 శాతం కంటే అదనంగా ఎంత ఇస్తారు అనే దానినుంచి చర్చలు ప్రారంభించాలని యూనియన్లు కోరాయి. దీనికి యాజమాన్య ప్రతినిధులు అంగీకరించలేదు. ఈ తీరును కార్మిక సంఘాలు నిరసించాయి. కోలిండియా యజమాన్యం కుట్రపూరితంగా కావాలనే వేతన ఒప్పందాన్ని ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేబీసీసీ సభ్యులు మంద నరసింహారావు విమర్శించారు. కమిటీలోని యాజమాన్య ప్రతినిధుల వైఖరిని కేంద్ర బొగ్గు శాఖ మంత్రినీ, కోల్ సెక్రటరీని కలిసి జోక్యం చేసుకోవాలని కోరాలని కార్మిక సంఘాలు సంయుక్తంగా నిర్ణయించాయి. వీరు ఈ అంశంపై తక్షణం చొరవ తీసుకొని 11వ వేతన ఒప్పంద పూర్తి చేసేందుకు యజమాన్యంపై ఒత్తిడి తెచ్చేలా కోరాలని అభిప్రాయపడ్డారు. ఈనెలలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలలోపు అన్ని యూనియన్ల నాయకులు కేంద్ర మంత్రిని కలవాలనీ, సమ్మె నోటీసు ఇచ్చి కార్మికులను పోరాటాలకు సిద్ధం చేయాలని నిర్ణయించారు. జేబీసీపీఐ సమావేశంలో కోలిండియా చైర్మెన్ ప్రమోద్ అగర్వాల్, సింగరేణి డైరెక్టర్ బలరాం, జనరల్ మేనేజర్ ఆనందరావు, డీడీ రామానందన్, మంద నరసింహారావు (సీఐటీయూ), సీతారామయ్య (ఏఐటీయుసీ), రియాజ్ అహ్మద్ (హెచ్ఎంఎస్), మాధవనాయక్ (బీఎమ్ఎస్) తదితరులు పాల్గొన్నారు.