Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోళ్లు కొనసాగించాలి
- రైస్ మిల్లులను తెరిపించాలి : సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నా
నవతెలంగాణ-కరీంనగర్
ఊకదంపుడు ఉపన్యాసాలు బంద్ చేసి.. ఉప్పుడు బియ్యం, సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలని సీఐటీయూ కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, గౌరవాధ్యక్షులు గిట్ల ముకుందరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పలు జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. కరీంనగర్ జిల్లా ఎఫ్‌సీఐ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను 2022 జూన్ 7వ తేదీ నుంచి నిలుపుదల చేశారని, ఫలితంగా రాష్ట్రంలో 1500రైస్ మిల్లు మూతపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో 2లక్షల మంది హమాలీ కార్మికులతోపాటు మిల్లు ఆపరేటర్స్, దినసరి కూలీ, గుమాస్తాలు, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్, ఇతర రైస్‌మిల్ ఆధారిత కార్మికులు పని కోల్పోయారని చెప్పారు. వలస కార్మికులకు పనులు లేని సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అనేక చట్టాలు ఉన్నపటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా సీఎంఆర్ బియ్యాన్ని నిలిపి వేయటం వల్ల రైస్‌మిల్లు వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లుల యాజమాన్యాలు గత రెండు సీజన్లో రైతుల నుంచి ధాన్యం సేకరించినప్పటికీ.. బియ్యంగా మార్చి అమ్మకపోవటంతో రైస్‌మిల్లు యాజమాన్యాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొననున్న ప్రధాని మోడీ ఊకదంపుడు ఉపన్యాసం కాకుండా.. బియ్యం కొనుగోలు చేస్తామని చెప్పాలని డిమాండ్ చేశారు. మూతపడిన మిల్లులను వెంటేనే తెరిపించాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. మిల్లు మూతపడిన కాలానికి వేతనాలు, కూలి చెల్లించాలని, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైసుమిల్లులు తెరిపించి హమాలీ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌శర్మకు వినతిపత్రం అందజేశారు.