Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని నరేంద్ర మోడీ, అగ్రనేతల రాక
- నిఘా పహారాలో నోవాటెల్
- నగరవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం
- మీడియాకు పాసుల జారీ విషయంలో తీవ్ర జాప్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరుగనున్నాయి. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా శుక్రవారం సాయంత్రానికి నగరానికి చేరుకున్నారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర అగ్రనేతలు నగరానికి రానున్నారు. మూడు రోజుల పాటు కేంద్ర పాలన హైదరాబాద్ కేంద్రంగా జరుగనున్న నేపథ్యంలో సిటీపోలీసులతో పాటు కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. సమావేశాలు జరుగనున్న నోవాటెల్‌ను నిఘా నీడలో ఉంది. అక్కడ ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచే నోవాటెల్ పరిసరప్రాంతాల్లోని ప్రజలు, వాహనదారులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. నోవాటెల్‌లోకి పాసులు, అనుమతి ఉన్నవారికే పోలీసులు అనుమతిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఘనంగా స్వాగతం పలుకనుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే జాతీయ కార్యవర్గ సమావేశాలను మోడీ ప్రారంభించి మాట్లాడుతారు. అంతకు ముందే ఉదయం జాతీయ ప్రధాన కార్య దర్శులు, ఆ తర్వాత పదాధికారుల సమావేశాలు జరుగనున్నాయి. నోవాటెల్ హోటల్ వద్ద సాంద్రాయ నృత్యాలు, కళాప్రదర్శనలను ఏర్పాటు చేశారు. బీజేపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీ ఎదిగిన తీరు, తెలంగాణ చరిత్రను చెప్పే ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అతిథుల కోసం ప్రత్యేకంగా వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఆదివారం సాయం త్రం ఆరుగంటలకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో విజరుసంకల్ప్ సభను నిర్వహించనున్నారు. దీనికి రాష్ట్రంలోని 35 వేల బూతుల నుంచి బీజేపీ శ్రేణులను తరలించే ప్రయత్నాల్లో ఆ పార్టీ ఉంది.
బీజేపీ తీరుపై జర్నలిస్టుల ఆగ్రహం
ఏ పార్టీ సమావేశాలు, సభలు పెట్టినా అది అనుకూల మీడియా నా? వ్యతిరేక మీడియా? అనే తారతమ్యాలు చూడకుండా అన్ని సంస్థల జర్నలిస్టులందరికీ పాసులు జారీ చేయడం ఆనవాయితీ. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆ సంస్కృతికి తిలో దకాలిచ్చింది. పాసుల పేరిట మూడు, నాలుగు రోజుల ముందే అందరి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. చివరకు తనకు నచ్చిన మీడియా సంస్థలకే ప్రాధాన్యత ఇచ్చిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పాసుల కోసం జర్నలిస్టులు ఆ పార్టీ కార్యాలయం, నోవాటెల్ వద్ద పడి గాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. 'మీ సంస్థలకు పాసు లివ్వొద్దనే నిర్ణయం జరిగింది' అని బీజేపీ కి చెందిన ఓ కీలక నేత వ్యాఖ్యానించా రు. మరికొంత మంది జర్నలిస్టులు తమ పాసుల సంగతేంటి? అని అడిగితే.. '40 పాసులు బిండ ఎక్కడో మిస్సయింది. దొరకగానే ఇస్తాం' అని దాటవేయడం గమనార్హం. ఒక ప్రధాని, కేంద్ర హోంశాఖమంత్రి, కేంద్ర క్యాబినెట్ మంత్రులు, ఆయా రాష్ట్రాల సీఎంలు వస్తున్న సమావేశాల నేపథ్యంలో ఆ పాసులు గనుక వేరేవాళ్ల చేతుల్లో పడితే..మిస్ యూజ్ అయితే ఎవరిది బాధ్యత అనే సోయి కూడా ఆ పార్టీ నేతలకు లేకుండా పోయిందని అర్ధమవుతున్నది.