Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ గన్‌మెన్‌కు తీవ్రగాయం
నవతెలంగాణ-హన్మకొండ
హనుమకొండ జిల్లా హంటర్‌రోడ్డులోని బీజేపీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల మధ్య కొట్లాటతో హైడ్రామా నెలకొంది. ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో సుబేదారి ఎస్ఐ గన్‌మెన్ అనిల్ తలకు తీవ్రగాయం కావడంతో హనుమకొండలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం హన్మకొండ జిల్లా హంటరోడ్లోని బీజేపీ ఆఫీసులో రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఓం ప్రకాష్ మాదుర్ రావడంతో బీజేపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి ఆందోళనకు దిగారు. ముందుగా మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ వాహనం అటువైపు రావడంతో బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా వాహనంపై దాడి చేశారు. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలతో, రాడ్లతో దాడులకు దిగడంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. కాంగ్రెస్ కార్యకర్తలను ఆపే ప్రయత్నంలో పోలీసులు ఉండగా బీజేపీ కార్యకర్తలు ముకుమ్మడిగా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి దిగడంతో సీఐ రాఘవేందర్ గన్‌మెన్ అనిల్ తలపై కర్రతో బలమైన దెబ్బ తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పోలీసులు అతన్ని హుటాహుటిన సుబేదారిలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఒక్క సారిగా భారీ స్థాయిలో కార్యకర్తలు రావడంతో పోలీసులు వారిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఈ సంఘటనతో హంటర్ రోడ్డులో భారీస్థాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.