Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాంతియుత ప్రదర్శనకు అనుమతివ్వాలి
- మోసం చేసింది చాలు..స్పందించండి..
- మాదిగల ఆగ్రహానికి గురికావొద్దు : మందకృష్ణ మాదిగ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు రూట్ మ్యాప్ ప్రకటించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ పూర్తి చేస్తామంటూ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఆ పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లయినా..ఈ విషయాన్ని తొక్కి పట్టారని విమర్శించారు. దీనిపై 28 ఏండ్లుగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ మోసాలు చెల్లవని బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నారనీ, అలాంటప్పుడు మరి బీజేపీ మోసాలు ఎలా చెల్లుతాయని నిలదీశారు. మోసం ఎవరు చేసినా మోసమేనని చెప్పారు. రెండు సీట్లున్న బీజేపీ..నేడు పూర్తి మెజార్టీ సాధించటానికి రామ మందిర నిర్మాణం వాగ్దానమే కారణమని చెప్పారు. భద్రాచలంలో రాముని సాక్షిగా వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి, ఆ సమస్యను సాగదీయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ తలుచుకుంటే క్షణాల్లో ఈ సమస్యను పరిష్కరించగలదనీ, దీనికి ప్రత్యక్ష ఉదాహారణ ఈబీసీ బిల్లును అత్యంత వేగంగా తీసుకురావటమేనని గుర్తుచేశారు. అందుకనుకూలంగా రాజ్యాంగ సవరణలు కూడా చేశారన్నారు. వర్గీకణ, మాదిగలను బీజేపీ జాతీయ కార్యవర్గంలో తీసుకునే విషయంలో ఆ పార్టీకి చిత్తశుద్ది లేదని చెప్పారు. హైదరాబాద్ మినహా తెలంగాణ, ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల్లో శనివారం సడక్ బంద్ యథాతథంగా ఉంటుందని చెప్పారు. ముడో తారీఖున ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంనుంచి ఇందిరాపార్కు వరకు వంద మందితో శాంతి యుతంగా ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. ఆ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని పోలీసు అధికారులను కోరారు. నగరంలో 144 సెక్షన్ విధించినట్టు చెబుతున్నారనీ, అలాంటప్పుడు పది లక్షల మందితో ఎలా సభ నిర్వహిస్తారనీ, చట్టం వారికి వర్తించదా? అని ప్రశ్నించారు. అరెస్టులు నిర్భంధాన్ని ప్రయోగించి మాదిగలను రెచ్చగొట్టొద్దన్నారు. ఓపిక నశిస్తే..జరిగే పరిణామాలకు పోలీసు అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు.