Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన మంత్రి మోడీకి
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన(2014) చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ చట్టం వచ్చి నేటికి ఎనిమిదేండ్లు గడుస్తున్నాయనీ, అయినా ఇప్పటి వరకూ వాటిలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఈమేరకు శుక్రవారం ప్రధాని మోడీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఇంతవరకు విభజన చట్టం అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల కాలంలో అనేక పర్యాయాలు హైదరాబాద్‌కు వచ్చి వెళ్ళినా ఏ ఒక్క సభలో కూడా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను మోడీ ప్రస్తావించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. అటు పార్లమెంటులో గానీ, ఇటు బయటగానీ వాటి గురించి ప్రస్తావించకపోగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపడుతూ మాట్లాడి రాష్ట్ర ప్రజల మనోభావాలను గాయపరించారని గుర్తు చేశారు. తల్లిని చంపి, పిల్లను బ్రతికించారంటూ చేసిన వ్యాఖ్యలు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని పేర్కొన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, విభజన చట్టంలో లేకపోయినా..తెలంగాణలోని ఏడు మండలాలను అఘమేఘాల మీద ఆర్డినెన్సు తెచ్చి ఏపీలో విలీనం చేశారని తెలిపారు. సీలేరులోని జలవిద్యుత్ ప్రాజెక్టును కూడా ఏపీకి అప్పగించారని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు విభజన చట్టం ద్వారా పార్లమెంటు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని అమలు చేయడమంటే, ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, రాజ్యాంగాన్ని గౌరవించటమేనని పేర్కొన్నారు. హైదరాబాద్ వస్తున్న సందర్భంలోనైనా బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఐఐఐటీ,ఐఐఎం, పసుపు బోర్డు, నవోదయ స్కూల్స్ ఏర్పాటుపై ప్రధాని మోడీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కొండా అజ్ఞానానికి నిదర్శనం: భట్టి
కాంగ్రెస్ చచ్చిపోయిందంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. ఆయన అజ్ఞానానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌ను చంపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ లౌకిక ప్రజాస్వామ్య విలువలతోపాటు సామజిక న్యాయం, సామజిక సంస్కరణలు కోరుకుంటుందని గుర్తు చేశారు. కొండా తన వ్యక్తిగత ఎజెండా కోసమే బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు. మతోన్మాద రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తూ...రాజకీయ ప్రయోజనం పొందుతున్న బీజేపీలో చేరడం ద్వారా కొండా తనలో ఉన్న భూస్వామ్య లక్షణాలను బయట పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజావ్యతిరేక భావజాలం ఉన్నవాడు కనుక కొండాకు బీజేపీ సిద్దాంతాలే నచ్చుతాయని ఎద్దేవా చేశారు.