Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయంగా రావాల్సిన పునరావాస పరిహారమివ్వాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
న్యాయమైన పరిహారం కోరుతూ ఆందోళన చేస్తున్న గౌరెల్లి నిర్వాసిత రైతులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైలులో నిర్బంధించడాన్ని, వారికి బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఇది వారిని అవమానించడమేననీ, ఇలాంటి ఘటనలు తగదని హెచ్చరించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ తాను రైతుల కోసమే పుట్టామనీ, జీవించినంత వరకు వారి కోసమే పనిచేస్తామంటూ గప్పాలు కొట్టి, వారిని ఈ విధంగా అవమానించడం సబబు కాదని తెలిపారు. వారి భూములు, ఇండ్లు తీసుకుని న్యాయమైన పరిహారం చెల్లించి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. వారిపై మోపిన కేసులు ఉపసంహరించాలనీ, న్యాయంగా వారికి రావాల్సిన పునరావాస పరిహారాన్ని అందజేయాలని సూచించారు.
సీపీఐ(ఎం) కేరళ కార్యాలయంపై దాడికి ఖండన
సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కమిటీ కార్యాలయం ఏకేజీ సెంటర్‌పై గురువారం రాత్రి జరిగిన దాడిని ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్నంగా పరిశీలించి దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి రెచ్చగొట్టే చర్యలను ప్రజాతంత్ర శక్తులందరూ నిరసించాలని విజ్ఞప్తి చేశారు.
సుప్రీం తీర్పు పట్ల హర్షం
ఉదయ్‌పూర్ ఘటనకు నుపుర్‌శర్మ వ్యాఖ్యలే కారణమనీ, దేశ ప్రజలకు ఆమె మీడియా ద్వారా క్షమాపణ చెప్పాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హర్షం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ, విచారించడంలో ఢిల్లీ పోలీసులు విఫలం చెందారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదని సూచించారు. సామరస్యంతో జీవిస్తున్న ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం, రెచ్చగొట్టడం తగదని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని తెలిపారు. సుప్రీం తీర్పునకు అనుగుణంగా మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై నుపుర్‌శర్మ వెంటనే దేశ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.