Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీజులు నియంత్రణ చట్టం తీసుకురావాలి
- ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి: పట్నం, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా డిమాండ్
నవతెలంగాణ- మీర్పేట్
విద్యా వ్యాపారాన్ని అరికట్టేందుకు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, విద్యావ్యాపారాన్ని అరికట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని పట్నం, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఆ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని గాయత్రీనగర్ సమతానాలెడ్జ్ హాల్లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక కమిటీ రాష్ట్ర కన్వీనర్ డిజి.నర్సింహారావు మాట్లాడారు. రాష్ట్రం విద్యా వ్యాపారం కేంద్రంగా మారిందన్నారు. ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థలను కేవలం లాభాపేక్షతోనే నడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనసన్నలోనే ఈ విద్యావ్యాపారం నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కేవలం పాఠశాలలు ప్రారంభమైన మూడు నెలల్లో(జూన్, జులై, ఆగస్టు) దాదాపు రూ. 25 వేల కోట్ల వరకు ఫీజుల రూపంలో విద్యా సంస్థలు వసూలు చేస్తున్నాయని తెలిపారు.
జీవో నెంబర్ 1ని ఉల్లంఘిస్తూ ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. నర్సరీ విద్యార్థులకు కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను, ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్నం నాయకులు సి.శోభన్, యాదయ్య, నర్సిరెడ్డి, సీఐటీయూ నాయకులు ఎల్లయ్య, బీఎస్పీ నాయకులు గురువయ్య, ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జగన్, శంకర్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు, పీడీఎస్‌యూ నాయకులు నవీన్, జేవీవీ నాయకులు సాయిబాబు, సమత భవన్ రాజేశ్వరరావు, అడ్వకేట్ వెంకన్న, కృష్ణ మోహన్, ఎస్ఎఫ్ఐ నాయకులు శివ, సిద్దు, స్టాలిన్, అరవింద్, డీవైఎఫ్ఐ నాయకులు, శ్రీనివాస్, స్వామి తదితరులు పాల్గొన్నారు.