Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేపర్-1లో 32.48 శాతం అర్హత
- పేపర్-2లో 49.64 శాతం ఉత్తీర్ణత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గతనెల 12న నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. పేపర్-1కు 3,51,476 మంది దరఖాస్తు చేయగా 3,18,444 మంది పరీక్ష రాశారు. వారిలో 1,04,078 (32.68 శాతం) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-2కు 2,77,893 మంది దరఖాస్తు చేస్తే, 2,50,897 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 1,24,535 (49.64 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారు. టెట్ ఫలితాలను రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఉషారాణి శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ఐదేండ్ల క్రితం అంటే 2017, జులై 23న టెట్ రాతపరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో పేపర్-1కు 98,848 మంది హాజరుకాగా, 56,708 (57.37 శాతం) మంది అర్హత సాధించారు. పేపర్-2కు 2,30,932 మంది పరీక్ష రాస్తే 45,045 (19.51 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. వాటితో ప్రస్తుత టెట్ ఫలితాలను పోల్చితే పేపర్-1లో అర్హత పొందిన వారు 24.69 శాతం తగ్గడం గమనార్హం. ఇక పేపర్-2లో అర్హత పొందిన వారు 30.13 శాతం పెరిగారు.
ఆ మార్కులు సాధిస్తేనే అర్హత
రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులు ప్రభుత్వం నిర్ణయించిన మార్కులు సాధిస్తేనే టెట్‌లో అర్హత సాధించినట్టు అవుతుంది. టెట్ రాతపరీక్ష 150 మార్కులకు నిర్వహించారు. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం (90 మార్కులు), బీసీలు 50 శాతం (75 మార్కులు), ఎస్సీ,ఎస్టీలు, వికలాంగులు 40 శాతం (60 మార్కులు) తప్పనిసరిగా పొందాలి. అంతకంటే తక్కువ మార్కులొస్తే వారు టెట్‌లో అర్హతను కోల్పోతారు. అర్హత సాధించిన అభ్యర్థులకే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కి దరఖాస్తు చేసేందుకు అవకాశముంటుంది.
అందుకే టెట్‌కు ప్రాధాన్యత
ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే టెట్‌లో తప్పనిసరిగా ఉత్తీర్ణత పొందాలన్న నిబంధన ఉన్నది. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉన్నది. అంటే టీఆర్టీ రాతపరీక్షకు 80 శాతం మార్కులు, టెట్‌లో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి రెండింటిలో మెరిట్ ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందుకే టెట్‌కు ప్రాధాన్యత నెలకొంది. 2011 నుంచి టెట్ అర్హత సంపాదిస్తే జీవితకాలం ఉంటుందని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను గతంలోనే విడుదల చేసింది. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులూ అర్హులేనని స్పష్టం చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం టెట్ పేపర్-1లో అంజనికి 133 మార్కులొచ్చాయి. ఇక టెట్ పేపర్-2లో మ్యాథ్స్, సైన్స్‌లో నక్క సరిత 127 మార్కులు, సోషల్ స్టడీస్‌లో రాజశేఖర్‌రెడ్డి 130 మార్కులు సాధించారు.