Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన అడుగు జాడల్లో నడుద్దాం
- వర్థంతి సభలో నవతెలంగాణ సంపాదకులు ఆర్.సుధాభాస్కర్, సీజీఎమ్ ప్రభాకర్ నివాళి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ (ఎం) మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ప్రజాశక్తి సాహితీ సంస్థ మాజీ చైర్మెన్, ఉమ్మడి రాష్ట్రంలో కార్యదర్శిగా సేవలందించిన కొరటాల సత్యనారాయణ కృషి, పట్టుదల, దిశా, నిర్దేశం వల్లే అప్పట్లో ప్రజాశక్తి, ఇప్పుడు నవతెలంగాణ ఈ స్థాయిలో ఉన్నాయని నవతెలంగాణ సంపాదకులు ఆర్. సుధాభాస్కర్, చీఫ్ జనరల్ మేనేజర్ పి.ప్రభాకర్ నివాళులర్పించారు. ఒకానొక దశలో ఎంతో అనార్యోగంతో ఉన్నప్పటికీ పత్రిక, దాని పురోభివృద్ధి పట్ల ఆయన కనబరిచిన శ్రద్ధ నిరుపమానమైందని వారు వ్యాఖ్యానించారు. కొరటాల వర్థంతిని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్హెచ్ భవన్లో సభను నిర్వహించారు. నవతెలంగాణ ఎడిటోరియల్ బోర్డు సభ్యులు కె.ఆనందాచారి అధ్యక్షత వహించిన ఈ కారక్రమంలో సుధాభాస్కర్, ప్రభాకర్... కొరటాల చిత్రపటానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సుధాభాస్కర్ మాట్లాడుతూ... ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల చూపిన అభిమానం మరువలేనిదని చెప్పారు. అందర్నీ ఆప్యాయంగా, తండ్రిలాగా 'అరేరు...' అని పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన అడుగుజాడల్లో నడవటం ద్వారా పత్రికను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రభాకర్ మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో అది రైతాంగ ఉద్యమమైనా, వ్యవసాయ కార్మిక ఉద్యమమైనా, చేనేత ఆందోళనైనా... అది ఏదైనా సరే, నేతలు కొరటాల సూచనలు, సలహాలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు సైతం అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వివిధ అంశాలపై కొరటాల సలహాలను తీసుకునేవారని గుర్తు చేశారు. అనేకానేక క్లిష్టమైన అంశాలపై ఆయనకు పట్టు ఉండటమే దీనికి కారణమని చెప్పారు. ప్రజాశక్తి దినపత్రిక నిర్వహణలో ఆయనది ప్రత్యేక పాత్రని తెలిపారు. సంస్థలోని ఉద్యోగులు, సిబ్బంది పట్ల ఎలా వ్యవహరించాలనే విషయాన్ని తాము ఆయన నుంచి నేర్చుకున్నామని వివరించారు. ఎమ్హెచ్ భవన్ నిర్మాణంలోనూ, దానికి నిధులు వసూలు చేయటంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ రకంగా మన పత్రికలపై ఆయన తనదైన ముద్రవేశారని చెప్పారు. సభలో పాల్గొన్న పలువురు నవతెలంగాణ మేనేజర్లు, ఎడిటోరియల్ బోర్డు సభ్యులు ఈ సందర్భంగా కొరటాలకు ఘన నివాళులర్పించారు.