Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయింపు
- కేంద్ర ప్రభుత్వానికి రూ.473 కోట్ల విలువైన ప్రతిపాదనలు.
- నేచర్ టూరిజం సర్క్యూట్ ప్యాకేజీల అభివృద్ధి దిశగా తెలంగాణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎకో-టూరిజాన్ని భారీ ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పర్యాటక శాఖకు నోడల్ ఏజెన్సీ అయిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీి) ద్వారా టూరిజం కార్యకలాపాలను చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, టీఎస్‌టీడీసీ కార్పొరేషన్ హోటళ్లు, రిసార్ట్లు, బోటు-క్రూజ్‌లు, వే-సైడ్ సౌకర్యాలు, రెస్టారెంట్లు, సస్పెన్షన్ వంతెనలు, సౌండ్, లైట్ షోలు, గ్లో గార్డెన్, మ్యూజికల్ వంటి పర్యాటక మౌలిక సదుపాయాలను ఆయా ప్రాంతాల్లో గుర్తించి అభివృద్ధి చేయడానికి సంస్థ కృషి చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక అభివృద్ధికి ప్యాకేజీ పర్యటనలు, బోటింగ్ కార్యకలాపాలను చేపట్టింది.
పర్యాటక అభివృద్ధికి రూ.750కోట్లు..
''కాళేశ్వరం టూరిజం సర్క్యూట్'' (మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్, కాళేశ్వరం టెంపుల్, అన్నారం బ్యారేజీ, అన్నారం వాటర్ కెనాల్, సుందిళ్ల బ్యారేజీ - ఎల్లంపల్లి రిజర్వాయర్) అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.750 కోట్లను ఇటీవల బడ్జెట్లో కేటాయించింది. ఈ మేరకు పనులు డిజైన్ దశలో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా టూరిస్టు స్పాట్లను గుర్తించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించనున్నారు. సీఎం విజన్ మేరకు రాష్ట్రాన్ని పర్యాటకపరంగా అగ్రస్థానంలో నిలపాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇప్పటికే చాలా ప్రాంతాలను టూరిస్టు స్పాట్లుగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నది. అందులో భాగంగా ఇంతకు ముందే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చేవారికి ఆహ్లాదం పంచేందుకు వీలుగా ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు. దీంతో సందర్శకుల నుంచి విశేష స్పందన రావడంతో కొత్తగా నిర్మించిన రిజర్వాయర్లు, ప్రాజెక్టులను కూడా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నది. ఈ నేపథ్యంలో మల్లన్నసాగర్ , రంగనాయకసాగర్లను కూడా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసింది. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా పర్యాటక ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు సైతం నిర్మించేందుకు వీలుగా మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ , మానేరు రివర్ ఫ్రంట్లను అభివృద్ధి చేసింది. తాజాగా, నాగార్జునసాగర్ వద్ద భారీ వ్యయంతో పర్యాటకులను ముఖ్యంగా బౌద్ద పర్యాటకులను ఆకర్శించే విధంగా బుద్ధవనం ప్రాజెక్టును నిర్మించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని, ఇప్పటికే పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసిన కాళేశ్వరం , సోమశిల, లక్నవరం, యాదాద్రి వంటి పర్యాటక ప్రాంతాలపై, వివిధ రాష్ట్రాలు, దేశాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
కేంద్రానికి ప్రతిపాదనలు..
రాష్ట్ర ప్రభుత్వం ''స్వదేశ్ దర్శన్, ప్రసాద్ స్కీమ్ కింద రూ.473 కోట్ల విలువ ఆధారిత ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపింది. మరికొన్ని కొత్త ప్రాజెక్టుల స్కీమ్‌ను అభివృద్ధి చేయడానికి కూడా భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు ఇటీవల ప్రతిపాదించింది. వాటిలో స్వదేశ్ దర్శన్ పథకం కింద మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.101.72 కోట్లతో తీర్థయాత్ర, ప్రకృతి టూరిజం సర్క్యూట్ అభివృద్ధి, రూ.98 కోట్లతో మంచిర్యాల జిల్లాలో ఎకో టూరిజం సర్క్యూట్ అభివృద్ధి, రాష్ట్రంలో ఫోర్ట్ సర్క్యూట్ అభివృద్ధికి రూ.101 కోట్లు, మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు, భద్రాచలంలోని భద్రాచలం గ్రూప్ ఆఫ్ టెంపుల్‌ల వద్ద తీర్థయాత్ర సౌకర్యాల అభివృద్ధికి రూ.61.84 కోట్లు, ములుగు జిల్లా రుద్రేశ్వరాలయం (రామప్ప) పుణ్యక్షేత్రం, వారసత్వ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.62.73 కోట్లు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.473 కోట్లు ఇవ్వాలని కోరింది. సంబంధిత అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ప్రతిపాదనలు ఆమోద దశలో ఉన్నట్టు తెలిసింది.పర్యాటక శాఖ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, తెలంగాణకు క్రమంగా వస్తున్న విదేశీ పర్యాటకులు పెరిగారు. 2019 - 2020 సంవత్సరంలో (కరోనా మహమ్మారి కి ముందు) 3.2 లక్షల మంది రాష్ట్రాన్ని సందర్శించారు.