Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థుల ఎదురుచూపు
- సర్కారు నుంచి స్పష్టత కరువు
- టెట్ ఫలితాలు విడుదల
- 22 వేల వరకు ఉపాధ్యాయ ఖాళీలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా?అని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు సైతం శుక్రవారం విడుదలయ్యాయి. టెట్ పేపర్-1లో 1,04,078 (32.68 శాతం) మంది, పేపర్-2లో 1,24,535 (49.64 శాతం) మంది అర్హత సాధించారు. గతంలో టెట్ రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థులూ ఉన్నారు. వారంతా టీఆర్టీ కోసం నిరీక్షిస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారి ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను 2017లో ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికీ ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. లాంగ్వేజ్ పండితులు (ఎల్పీ) 1,011, పీఈటీ 416, స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) 1,941, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎస్ఏపీఈ) 9, సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) 5,415 పోస్టుల చొప్పున మొత్తం 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ 2017, అక్టోబర్ 21న నోటిఫికేషన్ను విడుదల చేసింది. అంటే ఐదేండ్ల నుంచి ఉపాధ్యాయ నియామకాలను ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో టెట్ ఉత్తీర్ణులైన ఉపాధ్యాయ అభ్యర్థులు టీఆర్టీ కోసం ఎదురుచూస్తున్నారు.
సమాధానం చెప్పలేని సర్కారు...
శుక్రవారం టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. వాస్తవంగా విద్యాశాఖ మంత్రి ఈ ఫలితాలను విడుదల చేయాలి. కానీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఏదో ఒక ప్రకటన చేయాల్సి ఉంటుంది. దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత కరువైంది. ఉపాధ్యాయ ఖాళీలెన్ని, వాటి భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అందులోనూ మీడియా ప్రతినిధులు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రశ్నలను అడుగుతారు, వాటికి సరైన సమాధానం లేదు. దీంతో టీఆర్టీపై సమాధానం చెప్పలేకే టెట్ ఫలితాలను ఆన్లైన్లో విడుదల చేయాల్సి వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి ఇంకోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నది. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో సుమారు 22 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. వాటి భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో బోధనపై తీవ్ర ప్రభావం పడుతున్నది. శాశ్వత ఉపాధ్యాయ నియామకాలు చేపట్టే వరకు విద్యావాలంటీర్లనూ నియమించడం లేదు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. అటు ఉపాధ్యాయుల కొరత, ఇటు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో విద్యావాలంటీర్ల సేవలు అవసరమవుతాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఇంకోవైపు ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్ను జారీ చేయడం లేదన్న అసంతృప్తి అభ్యర్థుల్లో ఉన్నది.
ఉపాధ్యాయుల గుర్రు
వేసవి సెలవుల్లో పదోన్నతులు, బదిలీలు చేపడతామంటూ ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో సర్కారు తీరుపై ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు. పండితులు, పీఈటీల అప్గ్రెడేషన్ ప్రక్రియ పెండింగ్లోనే ఉన్నది. 5,571 ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులనూ ప్రభుత్వం మంజూరు చేయలేదు.
ఇలా అనేక సమస్యలతో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంఈవో, డిప్యూటీఈవో, డీఈవో వంటి పర్యవేక్షణ అధికారుల పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ఇన్ఛార్జీలతోనే నడుస్తున్నాయి. దీంతో సర్కారు తీరుపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఈనెల ఏడున హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నది.