Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ సంపదను కార్పొరేట్లకు ఇలాగే దోచిపెడతామని ఆమోదిస్తరా?
- బీజేపీ నేతలను ప్రశ్నించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలువకున్నా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలపై ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి ప్రభుత్వాలను కూల్చేయడమే తమ విధానపర నిర్ణయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేయగలరా? అని బీజేపీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని 8 రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చేయడమో? కూలేలా చేయడమో చేయటం వాస్తవం కాదా? ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా దురహంకార వైఖరిని బీజేపీ జాతీయ కార్యవర్గం సమర్థిస్తుందా? లేదా? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ అన్ని రాష్ట్రాలను ఆక్రమిస్తున్న బీజేపీకి చివరకు అదే గతి పడుతుందని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మగ్దూం భవన్లో సీపీఐ రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వందలాది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సమావేశాల ఏర్పాట్లు ఉన్నాయనీ, ఇదంతే చూస్తుంటే బీజేపీ పార్టీ కాదు ఓ కార్పొరేట్ కంపెనీ అనే అనుమానం తలెత్తుతున్నదని విమర్శించారు. మహారాష్ట్రలో శివసేన అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధిష్టానం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసిందన్నారు. ఇప్పుడు బీజేపీ కన్ను తెలంగాణపై పడిందన్నారు. ప్రస్తుతం బీజేపీని టీఆర్ఎస్ గట్టిగా వ్యతిరేకించడం సంతోషకరమనీ, ఇదే వైఖరిని జాతీయ స్థాయిలో కొనసాగించాలని సూచించారు. ప్రధాని మోడీ ప్రభుత్వ కార్యక్రమాలపై పర్యటిస్తే నిరసన వ్యక్తం చేస్తామే తప్ప రాజకీయ పార్టీ సభలకు వస్తే చేయబోమని స్పష్టం చేశారు. అజీజ్‌పాషా మాట్లాడుతూ.. ఉదరుపూర్ ఘటనలో దోషులకు ఉరిశిక్ష వేయాలనేది న్యాయమైన కోరిక అన్నారు. జీ7 దేశాల సమావేశం సందర్భంగా భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షిస్తానని సంతకం చేసిన ప్రధాని మోడీ స్వదేశంలో ప్రశ్నించే వారిపై ఉపా చట్టం కింద కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం దుర్మార్గమన్నారు. పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..రిమాండ్‌లో ఉన్న గౌరవెల్లి భూ నిర్వాసిత రైతులకు చేతులకు పోలీసులు సంకెళ్ళు వేసి కోర్టుకు తీసుకెళ్ళడం రైతులను అమమానపరచడమేనన్నారు. ప్రాజెక్టు కోసం తమ భూములను ఇచ్చినా, ఇప్పటి వరకు పరిహారం ఇవ్వకపోవడంపై పోరాటం చేస్తున్న రైతులను ఇలా వేధించడం దుర్మార్గమన్నారు. భూనిర్వాసితులకు సహాయ పునరావాసం కింద రూ.150 కోట్లు కేటాయిస్తే సరిపోతుందన్నారు. కోర్టు స్టే విధించినప్పటికీ ప్రాజెక్టు ట్రయల్ రన్ చేయాలంటూ టిఆర్ఎస్ ధర్నాలు చేయడం శోచనీయమన్నారు. వరంగల్,హన్మకొండలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలలో అర్హులకు పట్టాలు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలని బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేయాలన్నారు.