Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని సమాధానమివ్వాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్
- ముందస్తు అరెస్టులపై ఆగ్రహం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు.. మాట తప్పిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ విమర్శించారు. కేంద్ర సర్కారు వైఫల్యాలపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర నాయకుల పర్యటన సందర్భంగా ప్రజలు నిలదీస్తారనే శుక్రవారం సాయంత్రం నుంచి సీపీఐ(ఎం) నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం కూడా తమ పార్టీ నిజామాబాద్ జిల్లా నాయకులను అదుపులోకి తీసుకొని.. కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం చూపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
తక్షణమే రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను విడుదల చేసి, విభజన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విభజన హామీలైన ఐటీఐఆర్, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వంటివి కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. గిరిజన యూనివర్సిటీ అతీగతి లేదన్నారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన పథకాలకు నిధులతో పాటు, రాష్ట్రానికి చట్టపరంగా రావాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను మూసివేసి వేలాది ఎకరాల భూమిని అమ్ముకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి మాటలకే పరిమితమవుతున్నారు తప్ప, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాదులో బీజేపీ సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.రమ, జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు, నాయకులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, సబ్బని లత, వెంకటేష్, శంకర్ గౌడ్, ఏశాల గంగాధర్ పెద్ది సూరి, నన్నే సాబ్, కొండ గంగాధర్, అనిల్, విగేష్ తదితరులు పాల్గొన్నారు.